హైదరాబాద్: తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్ధేశించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా గచ్చిబౌలిలోని హెచ్ఐసీసీలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ‘ఇది అభివృద్ధి ఉత్సవం.. కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం కాదు’ అని చేసినటువంటి పలు వ్యాఖ్యలకు సరదాగా, నవ్వుతూనే ప్రధాని మోదీ నర్మగర్భంగా కౌంటర్ ఇవ్వడం గమనార్హం.
ప్రధాని మోదీ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రాజకీయాలు మాట్లాడనని చెప్పారని, అందువల్ల తాను కూడా మాట్లాడనని అన్నారు. గుజరాత్ తరహాలో తెలంగాణా అభివృద్ధికి నిధులు కావాలని కోరుతున్నారని, వాస్తవానికి గుజరాత్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఇస్తున్న నిధుల్లో సగం మొత్తం కూడా తెలంగాణాకు రావని అన్నారు. గుజరాత్ తో పోల్చుకోవలసిన అవసరం లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నపుడు రైల్వే బడ్జెట్ లో రూ. వెయ్యి కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చేవని, ప్రస్తుతం తెలంగాణాకే రూ. 5,500 కోట్ల నిధులు రైల్వే బడ్జెట్ లో ఇస్తున్నట్లు చెప్పారు.
ఇవిగాక మరో యాభై వేల కోట్ల రూపాయల మొత్తానికి సంబంధించిన ప్రాజెక్టులు తెలంగాణాకు రానున్నాయని, అభివృద్ధిలో తెలంగాణా వికసిస్తే దేశం వికసించినట్లేనని కూడా ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ‘నేను రేవంత్ గారితో చెబుతున్నాను.. గడచిన పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రానికి ఎంత ఇచ్చిందో, అదే మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నేను అక్కడ ఇచ్చేది ఇక్కడ కూడా ఇస్తే సగం మాత్రమే మీకు లభిస్తుంది. మీరు గుజరాత్ తో పోల్చుకోవద్దు.. అది మీకు నచ్చితే నాతో కలిసి నడవండి’ అని ప్రధాని మోదీ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ప్రధాని ప్రసంగంలోని ఆయా వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి కూడా నవ్వుతూ అస్వాదించడం విశేషం.
