ఖమ్మం: జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావును బుధవారం ఖమ్మంలో విచారించారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకున్న ముగ్గురు అధికారుల NIA టీం మాస్ లైన్ పార్టీ ఆఫీసులోనే పోటు రంగారావును దాదాపు రెండున్నర గంటలపాటు విచారించింది. ఈ సందర్భంగా తనకు NIA అధికారులు సంధించిన ప్రశ్నలను, తాను ఇచ్చిన సమాధానాలను విచారణ ముగిశాక పోటు రంగారావు మీడియాకు వెల్లడించారు.
ఆయన చెప్పిన వివరాల సారాంశం ప్రకారం.. తొలుత పోటు రంగారావు పుట్టు, పూర్వోత్తరాలను, విద్యాభ్యాసం, వామపక్ష ఉద్యమ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఛత్తీస్ గఢ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్ట్ అగ్ర నేతలు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యానారాయణరెడ్డిలు తెలుసా? ఆ ఇద్దరు నక్సల్స్ అంత్యక్రియలకు మీరు హాజరయ్యారా? గాదె ఇన్నయ్య తెలుసా? ఆయనకు మీరేమైనా విరాళాలు ఇచ్చారా? ఆపరేషన్ కగార్ పై మీ వైఖరి ఏమిటి? లొంగిపోయిన మావోయిస్టులపై మీ వైఖరేమిటి? వంటి అనేక ప్రశ్నలను రంగారావుకు NIA అధికారులు సంధించారు.
అయితే వాళ్లెవరూ తనకు తెలియనది పోటు రంగారావు జవాబిచ్చారు. గాదె ఇన్నయ్య మొబైల్ నుంచి వాట్సాప్ ద్వారా పంపిన కరపత్రాల గురించి, మావోయిస్ట్ పార్టీకి చెందిన డాక్యుమెంట్ల గురించి, హిడ్మా చనిపోయిన తర్వాత అతని తల్లిని కలిసిన వీడియో పంపడంపై NIA అధికారులు పోటు రంగారావును ప్రశ్నించారు. గాదె ఇన్నయ్య ఫోన్ లో గల వేలాది మంది కాంటాక్టుల్లోని 100 మందికే ఈ తరహా కరపత్రాలు, డాక్యుమెంట్లు వెళ్లాయని, అతను మీకు ఎందుకు పంపారని, అందులో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. తాము రాజకీయ పార్టీకి చెందిన నాయకుడిని కాబట్టి తనకు ఇన్నయ్య పంపి ఉంటాడని, అతనితో వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధాలు లేవని రంగారావు పేర్కొన్నారు.

వాస్తవానికి మావోయిస్ట్ పార్టీ తమ పార్టీకి, తమ పార్టీకి చెందిన నాయకులకు కూడా డెత్ వారెంట్లు జారీ చేసిన సందర్భాలున్నాయని, తాము కూడా వారితో పోరాడిన అంశాన్ని రంగారావు NIA అధికారులకు కూలంకషంగా వివరించారు. అమరుల ఆశయాలు కొనసాగిస్తామని గాదె ఇన్నయ్య నినదించడంలో అర్థమేంటి? అని కూడా రంగారావును NIA అధికారులు ప్రశ్నించారు. నక్సల్ నేతల అంత్యక్రియ సందర్భంగా గాదె ఇన్నయ్య చేసిన వీడియో ప్రసంగాన్ని కూడా ఎన్ఐఏ అధికారులు రంగారావుకు వినిపించారు. ఆయన ప్రసంగంలోని నినాదాల, అంశాల అర్ధమేంటని అడిగారు. మావోయిస్ట్ పార్టీ భావజాలాన్ని గాదె ఇన్నయ్య వ్యాపింపజేయడం కాదా? అని అడిగారు.
అమరవీరులకు జోహార్లు.. అని కేసీఆర్, రేవంత్ రెడ్డిలతోపాటు తాము కూడా నినదిస్తామని రంగారావు చెప్పారు. సోషలిస్టు సమాజాన్ని స్థాపించడం, అన్యాయమైన వ్యవస్థను రద్దు చేయడమే అమరవీరుల ఆశయాలను సాధించమనే నినాదంలోని అర్థంగా తమ అభిప్రాయమని పోటు పేర్కొన్నారు. అనేక వీడియోలను, డాక్యుమెంట్లను, కరపత్రాలను మీకే గాదె ఇన్నయ్య ఎందుకు పంపాడని ప్రశ్నించారు. మీ ద్వారా ప్రచారం చేసేందుకే గాదె ఇన్నయ్య వాటిని మీకు పంపాడా? అని కూడా అడిగారు.
ఓ రాజకీయ పార్టీగా తాము అందరి అభిప్రాయాలను సేకరించి, మంచీ, చెడులను తెలుసుకుంటామని రంగారావు చెప్పారు. సైద్ధాంతికంగా మావోయిస్టు పార్టీతో తమకూ వైరుధ్యముందని చెప్పారు. తాను చెప్పిన వివరాలను NIA అధికారులు రాసుకున్నారని, చదివి వినిపించారని రంగారావు మీడియా సమావేశంలో చెప్పారు.
