Top 5 This Week

Related Posts

ఖమ్మానికి నేడు NIA అధికారుల రాక

ఖమ్మం: జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు బుధవారం ఖమ్మం రానున్నారు. సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావును విచారించేందుకు NIA అధికారులు ఖమ్మం నగరానికి వస్తున్నారు. ఈమేరకు మాస్ లైన్ పార్టీ నాయకులకు NIA అధికారులు సమాచారం కూడా అందించారు. పోటు రంగారావుకు ఈనెల 2వ తేదీన ఎన్ఐఏ అధికారులు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.

పోటు రంగారావుపై దేశద్రోహం, ఉపా కేసు ఉందని, ఈనెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో NIA పేర్కొంది. CRPCలోని 160 సెక్షన్ కింద ఆయా నోటీస్ జారీ చేశారు. గత నవంబర్ 26వ తేదీన హైదరాబాద్ ఎన్ఐఏ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 152, UA(P) యాక్ట్ లోని సెక్షన్ 13, 39 కింద కేసు నమోదైనట్లు నోటీసులో పేర్కొన్నారు.

మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు

ఒకవేళ తాము పేర్కొన్న స్థలానికి విచారణకు హాజరు కాలేనిపక్షంలో, ప్రత్యామ్నాయ స్థలంపై తమకు ఈనెల 15వ తేదీలోగా సమాచారం అందించాలని NIA అధికారులకు రంగారావుకు జారీ చేసిన నోటీసులో కోరారు. ఈ నేపథ్యంలోనే తాను విచారణకు సిద్దంగా ఉన్నానని, ఈనెల 22వ తేదీన ఖమ్మంలో అందుబాటులో ఉంటానని పోటు రంగారవు NIA అధికారులకు లిఖితపూర్వకంగా లేఖ రాస్తూ సమాచారం అందించారు.

ఖమ్మంలోని తమ పార్టీ కార్యాలయమైన రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో అందుబాటులో ఉంటానని రంగారావు NIA అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోటు రంగారావును విచారణ చేయడానికి NIA బుధవారం ఖమ్మం రానున్నారు. రంగారావును విచారించేందుకు NIA అధికారులు మాస్ లైన్ పార్టీ కార్యాలయానికి బుధవారం మధ్యాహ్నం 3.00 గంటలకు చేరుకోనున్నారు.

Popular Articles