Top 5 This Week

Related Posts

రాష్ట్ర ఖజానాపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

ఖమ్మం: తెలంగాణా రాష్ట్ర ఖజానాపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉందన్నారు. అయినప్పటికీ పేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం వెనుకంజ వేయడం లేదన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శుక్రవారం పర్యటించారు. నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఆయా కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజా ప్రభుత్వంలో పేదల వైద్యం, విద్యకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి హామీలను తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఏప్రిల్ ఆఖరు లేదా మే మొదటి వారంలో రెండో విడత మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు. అర్హులైన ప్రతి నిరుపేదకూ మూడు విడతల్లో పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

అంతకు ముందు కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో రూ. 1.52 కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం
గోదాములను మంత్రి ప్రారంభించారు. కూసుమంచి మండలానికి చెందిన 191 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 58.58 లక్షల విలువైన చెక్కులను కూడా మంత్రి పంపిణీ చేశారు.

Popular Articles