(సమీక్ష ప్రత్యేక కథనం)
పని చేయాల్సిన వ్యవస్థలు నిద్రావస్థలో జోగుతుంటే వ్యవస్థీకృత నేరగాళ్లు (ఆర్గనైజ్డ్ క్రిమినల్స్) రెచ్చిపోతుంటారు. ఫలితంగా ప్రజలకు, ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరుగుతుంది. ఈ పరిణామం ప్రభుత్వం యంత్రాంగం పనితీరును సహజంగానే వేలెత్తి చూపుతుంది. ఇసుక స్మగ్లింగ్ కు తిరుగులేని కేంద్రంగా భాసిల్లుతున్న సత్తుపల్లి పట్టణంలోని ప్రభుత్వ యంత్రాంగపు విభాగాల పనితీరు ఇందుకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఇది ఎవరో గిట్టనివారు చేస్తున్న ఆరోపణ కాదు.. సాక్షాత్తూ తెలంగాణా ప్రభుత్వ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం చెబుతున్న మాట. ఆ శాఖ డైరెక్టర్ జనరల్ విడుదల చేసిన పత్రికా ప్రకటనే ఇందుకు ప్రబల సాక్యం.
గత శుక్రవారం సత్తుపల్లి మండలం నారాయణపురం వద్ద ఇసుక స్మగ్లింగ్ చేస్తున్న మూడు టిప్పర్లను విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ వరంగల్ యూనిట్ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సత్తుపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నెం. 150/2026 ద్వారా నమోదు చేసిన కేసులో మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. వీరిపై సెక్షన్లు 61(1), 318(4), 329(3), 303(2), 111(1), r/w 3(5) BNS, 3 PDPPA, 21(1) MMDARA చట్టాల కింద కేసు నమోదు చేశారు.
మొత్తం ఎనిమిది మంది నిందితుల్లో ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ముఖ్య అనుచరునిగా ప్రాచుర్యం పొందిన దొడ్డా శ్రీనివాసరావును ఏడో నిందితునిగా, అతని భార్య దొడ్డా ధనలక్ష్మిని నాలుగో నిందితురాలిగా, శ్రీనివాసరావు కుమారుడైన దొడ్డా ప్రవీణ్ ను ఎనిమిదో నిందితునిగా చేర్చారు. మిగతా ఐదుగురు నిందితుల్లో ఇసుక టిప్పర్ల డ్రైవర్లు తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా గత శుక్రవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగపు డైరెక్టర్ జనరల్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఓ ఆసక్తికర అంశం దాగి ఉండడం గమనార్హం. ఈ నేరం వ్యవస్థీకృతంగా జరుగుతున్నట్లు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించడం మరో విశేషం. అంతేకాదు ప్రాథమిక విచారణలో తేలిన వివరాల ప్రకారం గడచిన ఆరు నెలలుగా ఈ ముఠా ఏపీలోని కొవ్వూరు ఇసుక రేవు నుంచి తెలంగాణాలోని సత్తుపల్లికి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు.
ఎటువంటి చట్టపరమైన అనుమతులు లేకుండా, రవాణాకు పర్మిట్లు లేకుండా, ఇసుక లోడింగ్ కోసం జేసీబీలను వాడినట్లు కూడా పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించి అక్రమంగా లాభాలు ఆర్జించేందుకు దొడ్డా శ్రీనివాసరావు, దొడ్డా ప్రవీణ్ అనే వ్యక్తులు ఇసుక అక్రమ రవాణాకు కుట్ర పన్నినట్లు కూడా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విడుదల చేసిన ప్రకటన స్పష్టం చేసింది. కేవలం శుక్రవారం రోజున పట్టుబడిన మూడు టిప్పర్లలోని ఇసుక విలువ రూ. 92,000గా అధికారులు ప్రకటించారు. అంటే రమారమిగా ఓ లక్ష రూపాయల విలువైన అక్రమ ఇసుక అన్నమాట.
విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం వెల్లడించిన ప్రకటనలోని కీలకాంశాన్ని ఓసారి లోతుగా పరిశీలిస్తే.. గడచిన ఆరు నెలలుగా దొడ్డా శ్రీనివాసరావు, ప్రవీణ్ ల సారథ్యంలోని ముఠా ఇసుక స్మగ్లింగ్ కు పాల్పడుతోంది. దినసరి రెండు ట్రిప్పుల చొప్పున పరిగణించినా మూడు టిప్పర్ల ద్వారా సుమారు రూ. 2.00 లక్షల విలువైన ఇసుకను అక్రమంగా రవాణా చేసినట్లుగా ఓ అంచనా. కానీ పట్టుబడింది కేవలం మూడు టిప్పర్లు మాత్రమేనని, దొడ్డా శ్రీనివాసరావు అండ్ గ్యాంగ్ కార్యకలాపాల వల్ల ఏపీ నుంచి దినసరి కనిష్టంగా పది టిప్పర్ల ఇసుక రవాణా అయిందనేది సత్తుపల్లి పట్టణంలో జరుగుతున్న చర్చ.

ఈ ప్రాతిపదికన ఓ పది టిప్పర్లలో టిప్పర్ కు రూ. 30,000 విలువగా, దినసరి రెండు ట్రిప్పుల చొప్పున గణిస్తే మొత్తం పది టిప్పర్ల ద్వారా రూ. 6.00 లక్షల విలువైన ఇసుక అక్రమంగా రవాణా అయినట్లుగా భావించవచ్చు. అంటే నెలకు రూ. 1.80 కోట్లు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ప్రకటించిన ప్రకారం గడచిన ఆరు నెలలకు గణిస్తే రూ. 10.80 కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా రవాణా చేసినట్లు అంచనా వేయవచ్చు. విజిలెన్స్ అధికారులు ఇది ప్రాథమికంగా గుర్తించిన అంశం మాత్రమే.
కానీ స్థానికంగా జరుగుతున్న ప్రచారం మాత్రం ఇందుకు భిన్నంగా ఉండడం గమనార్హం. కాంగ్రెష్ పార్టీ అధికారంలోకివ వచ్చిన తర్వాత దాదాపు రెండేళ్లుగా సత్తుపల్లిలో ఇసుక అక్రమ విక్రయ దందా నిరాటంకంగా సాగుతున్నట్లు ప్రచారం ఉంది. ఈ ప్రాతిపదికన ఎన్ని కోట్ల విలువైన ఇసుకను అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ముఖ్య అనుచరునిగా పేరుతెచ్చుకున్న దొడ్డా శ్రీనివాసరావు గ్యాంగ్ తరలించి సొమ్ము చేసుకుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ జనంలో జరుగుతున్న ప్రచారానికి తాడూ, బొంగరం లేదని కాసేపు భావించినా, విజిలెన్స్ అధికారులు ప్రకటించిన ప్రకారమే గడచిన ఆరు నెలలుగా దొడ్డా శ్రీనివాసరావు ముఠా సాగించిన ఈ అక్రమ దందా ఇన్నాళ్లపాటు స్థానిక అధికార యంత్రాంగానికి ఎందుకు కనిపించలేదన్నదే అసలు ప్రశ్న. ఎక్కడో 200 కిలోమీటర్లకు పైగా దూరంలోని వరంగల్ నుంచి విజిలెన్స్ అధికారులు వచ్చి, అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్లను సీజ్ చేస్తే తప్ప దొడ్డా శ్రీనివాసరావు ముఠా కార్యకలాపాలు వెలుగులోకి రాకపోవడమే ఆశ్చర్యకరమైన అంశంగా భావిస్తున్నారు. ఇప్పుడు ఇదే పాయింట్ ప్రామాణికంగా సత్తుపల్లిలో రకరకాల ప్రచారాలు జనం నోట చర్చగా మారాయి.
కాగా గత శుక్రవారం అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ల స్వాధీనం, కేసు నమోదు పరిణామాల అనంతరం నిందితులైన దొడ్డా శ్రీనివాసరావు సహా కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో బీఎన్ఎస్ చట్టంలోని వ్యవస్థీకృత నేరం కింద సెక్షన్ 111 (1) ను పొందుపర్చడంతో నిందితుల అరెస్ట్ అనివార్యంగా పోలీసు వర్గాలు స్పష్టం చేస్తన్నాయి. ఈ పరిణామాల్లోనే దొడ్డా శ్రీనివాసరావు, కుటుంబ సభ్యులు పోలీసులకు చిక్కకుండా, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తాజాగా జరుగుతున్న ప్రచారపు సారాంశం.

