Top 5 This Week

Related Posts

లైంగిక వాంఛ తీర్చలేదని వృద్ధురాలి హత్య, యావజ్జీవ శిక్ష

ఖమ్మం: లైంగిక వాంఛ తీర్చలేదని డెబ్బయి ఏళ్ల వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు, రూ. 15 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం రెండవ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు జడ్జి వెంపటి అపర్ణ మంగళవారం తీర్పు చెప్పారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో 2021 ఏప్రిల్ 21వ తేదీన జరిగిన ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది.

ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కారేపల్లి అంబేడ్కర్ కాలనీకి చెందిన ఆదెర్ల ఉపేందర్ (54) అనే వ్యక్తి భజ్యాతండాకు చెందిన అజ్మీరా నాజి (70) అనే వృద్ధురాలిని లైంగిక వాంఛ తీర్చాల్సిందిగా అడిగాడు. అందుకు తిరస్కరించిందనే ఆగ్రహంతో ఉపేందర్ నాజిని ఆమె ఇంటి వద్ద దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేశాడు. కాళ్లు, చేతులు, తలను మొండెం నుంచి వేరు చేసి ఓ బస్తాలో వేసుకుని మరో యువకుడి సాయంతో తరలించేందుకు ఉపేందర్ ప్రయత్నించాడు.

అయితే ఆ యువకుడు బస్తా గురించి ఉపేందర్ ను ప్రశ్నించగా, అది అడవి పందిగా పేర్కొని, దుర్వాసన వస్తుండటంతో అటవీ అధికారులు చూస్తే కేసు అవుతుందని బయట పడవేస్తున్నానని నమ్మబలికాడు. ఆ యువకుడి సాయంతో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం తిర్లాపురం రైల్వే ట్రాక్ పై నాజి శరీర భాగాలను ఉపేందర్ పడేశాడు. కానీ ఉపేందర్ మాటల్లో అనుమానం కలిగిన సదరు యువకుడు పడేసిన మూటను విప్పి చూడగా, అందులో మొండెం కనిపించింది. దీంతో భయాందోళనలకు గురైన సదరు యువకుడు కారేపల్లి పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు ఉపేందర్ ను పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. తన లైంగిక వాంఛను తిరస్కరించినందుకే నాజిని హత్య చేశానని, శవాన్ని మాయం చేసేందుకే ఇలా వ్యవహరించానని ఉపేందర్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. కేసు సమగ్ర దర్యాప్తు అనంతరం పోలీసులు కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. నిందితుడు ఉపేందర్ పై మోపిన అభియోగం రుజువు కావటంతో నాజి హత్య కేసులో అతన్ని దోషిగా నిర్ధారిస్తూ, అతనికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ. 15 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి అపర్ణ తీర్పు వెలువరించారు.

ఈ కేసులో ప్రాసిక్యూషన్ కు సహకరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శంకర్, (ప్రస్తుతం రిటైర్డ్) అప్పటి విచారణ అధికారులు పి.సురేష్, శ్రీనివాసులు, ఆరిఫ్ అలీఖాన్, అదనపు ప్రభుత్వ న్యాయవాది పి. స్వప్న, కారేపల్లి ఎస్సై గోపి, కోర్టు డ్యూటీ హెడ్ కానిస్టేబుల్ టి వెంకటేశ్వరరావు, కోర్టు లైజనింగ్ కె. శ్రీకాంత్, హోంగార్డ్ యూసఫ్ ను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

Popular Articles