సత్తుపల్లి: ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి సత్తుపల్లి పోలీసులు నిన్న నమోదు చేసిన కేసులో కీలక అంశాలు వెలుగు చూశాయి. అధికార పార్టీకి చెందిన ఖమ్మం జిల్లాలోని ఓ ఎమ్మెల్యే ముఖ్య అనుచరునిగా పేరుగాంచిన దొడ్డా శ్రీనివాసరావుపైనేగాక, అతని భార్య, కుమారున్ని కూడా పోలీసులు ఈ కేసులో నిందితుల జాబితాలో చేర్చడం గమనార్హం. సత్తుపల్లి మండలం నారాయణపురం వద్ద 100 మెట్రిక్ టన్నుల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుండగా మూడు టిప్పర్లను వరంగల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే.
ఎఫ్ఐఆర్ నెం. 150/2026 ద్వారా నమోదు చేసిన ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులపై సెక్షన్లు 61(1), 318(4), 329(3), 303(2), 111(1), r/w 3(5) BNS, 3 PDPPA, 21(1) MMDARA చట్టాల కింద కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ముఖ్య అనుచరునిగా ప్రాచుర్యం పొందిన దొడ్డా శ్రీనివాసరావును ఏడో నిందితునిగా, ఇతని భార్య దొడ్డా ధనలక్ష్మిని నాలుగో నిందితురాలిగా, శ్రీనివాసరావుకు కుమారుడు దొడ్డా ప్రవీణ్ ను ఎనిమిదో నిందితునిగా చేర్చారు.

ఇక కోట క్రిష్ణ, షేక్ ఫిరోజ్, పొదిలి నరసింహారావు అనే ముగ్గురు డ్రైవర్లను వరుసటి 1, 2, 3వ నిందితులుగా చేర్చారు. అదేవిధంగా ఐదో నిందితునిగా, బొల్లెన రోహిత్ ను, ఆరో నిందితురాలిగా బొప్పన నందిని అనే మహిళను చేర్చారు. వీరిలో కొందరిని టిప్పర్ యజమానులుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో నివేదించారు. స్వాధీనం చేసుకున్న టిప్పర్ల నుంచి రూ. 92,000 విలువైన ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
చట్టవిరుద్ధంగా ఇసుకను రవాణా చేయడం, సహజ ప్రజా వనరులను ధ్వంసం చేయడం, ప్రభుత్వ ఆస్తిని దొంగిలించడం, ఎటువంటి అనుమతులు లేకుండా నేరపూరిత కుట్రతో ఇసుకను విక్రయించడం ద్వారా అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారనే అభియోగాలను దొడ్డా శ్రీనివాసరావు సహా మొత్తం ఎనిమిది మంది నిందితులపై అభియోగాలుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో మోపారు. నిర్వాహకులు, డ్రైవర్లు, వాహన యజమానులైన నిందితులపైనేగాక వాహనాలపైనా చర్యలు తీసుకోవాలని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

