Top 5 This Week

Related Posts

అక్రమ ఇసుక దందా: ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే అనుచరునిపై క్రిమినల్ కేసు

ఖమ్మం: అక్రమ ఇసుక దందా బాగోతంలో అధికార పార్టీకి చెందిన ఖమ్మం జిల్లాలోని ఓ ఎమ్మెల్యే ప్రధాన అనుచరునిపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరునికి చెందిన మూడు ఇసుక టిప్పర్లను కూడా అధికారులు ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని కొవ్వూరు ఇసుక రేవు నుంచి తెలంగాణాలోని సత్తుపల్లికి అక్రమ ఇసుక దందాను నిర్వహిస్తుండగా తాము ఈ చర్య తీసుకున్నట్లు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వరంగల్ యూనిట్ అధికారులు ప్రకటించారు.

శుక్రవారం రాత్రి విడుదలైన అధికారిక ప్రకటన ప్రకారం.. అంతర్ రాష్ట్రీయంగా ఇసుక స్మగ్లింగ్ జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామ శివారులో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘా వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో 100 మెట్రిక్ టన్నుల ఇసుకతో నిండిన మూడు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డ్రైవర్లను అధికారులు విచారించగా, తాము బేతుపల్లికి చెందినవారమని వారు తెలిపారు.

ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించి, ఇసుక అక్రమ రవాణా ద్వారా లాభాలు ఆర్జించేందుకు దొడ్డా శ్రీనివాసరావు, దొడ్డా ప్రవీణ్ అనే వ్యక్తులు ఈ అక్రమ వ్యవహారానికి కుట్ర పన్నినట్లు తమ విచారణలో తేలిందని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెల్లడించారు. గడచిన ఆరు నెలలుగా ఈ ముఠా ఏపీలోని కొవ్వూరు ఇసుక రేవు నుంచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేలిందన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని తెలిపారు.

ఈ ఘటనలో టిప్పర్ల డ్రైవర్లు, యజమానులు, నిర్వాహకులు సహా మొత్తం ఎనిమిది మందిని ఇసుక అక్రమ రవాణాలో నిందితులుగా గుర్తించి సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ నెం.150/2026 ద్వారా బీఎన్ఎస్, పీడీపీపీ చట్టం, ఎంఎండీఆర్ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పారు. కాగా ఈ ఇసుక దందాలో నిందితుల్లోని దొడ్డా శ్రీనివాసరావు అధికార పార్టీకి చెందిన ఖమ్మం జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరునిగా పేరుండడం గమనార్హం. ఈ ఘటన సత్తుపల్లి నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Popular Articles