సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంత భూ వివాదాలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంత భూవివాదాలకు చెక్ పెడుతూ, కాలపరిమితి లోగా భూముల కొలతలు నిర్వహించి, పహానీల్లో పేర్లు నమోదు చేయిస్తామన్నారు. సత్తుపల్లి పట్టణంలోని ఎంఆర్ గార్డెన్స్ లో పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి మండలాలకు సంబంధించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – ప్రజా దర్బార్’ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, సత్తుపల్లి పట్టణ పరిధిలోని 399 సర్వే నంబర్ అంశంతో పాటు, చుట్టుపక్కల 9 గ్రామాల్లోని దాదాపు 6,500 ఎకరాల భూ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. పేదపల్లి, నారాయణపురం పరిసరాల్లోని 5,500 ఎకరాల పైచిలుకు భూములను క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో కొలతలు (సర్వే) చేపట్టి, స్వాధీనంలో ఉన్న అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని, పహానీలలో వారి పేర్లు ఎక్కించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ వేగంగా పూర్తి కావడానికి రైతులు, స్థానికులు అధికారులకు సహకరించాలని కోరారు. పాత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిధుల బకాయిలు, ఇతర పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, ఒకట్రెండు రోజుల్లోనే ఫలితాలు వస్తాయని చెప్పారు.

అదేవిధంగా రుద్రాక్షపల్లి, కొకపాడు, తాళపెంట, రామచంద్రాపురం, వెంకటగిరి సహా సరిహద్దుల్లోని 10-12 గ్రామాల్లో నెలకొన్న అటవీ-రెవెన్యూ భూముల వివాదాలపైనా మంత్రి కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ వర్షాకాలం ప్రారంభమయ్యేలోపే అటవీ సరిహద్దులను కొలిచి తేల్చాలన్నారు. మిగిలిన రెవెన్యూ భూమిలో తరతరాలుగా సాగు చేసుకుంటున్న పేదలకు పట్టాలు ఇచ్చే బాధ్యత తనదేనని అని మంత్రి పేర్కొన్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు పొందిన రైతులు సాగు కోసం బోర్లు వేసుకుంటుంటే అటవీ శాఖ అధికారులు ఎక్కడా అభ్యంతరాలు పెట్టవద్దన్నారు. ఈ అంశంలో జిల్లా అదనపు కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్లు ఈ వ్యవహారాలను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.

