ఇల్లెందు: లిక్కర్ ‘సిండికేట్ గణేష్’గా ప్రాచుర్యం పొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేష్ పై ఇల్లెందు పోలీసులు ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. బాణోత్ గోపీచంద్ అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గణేష్ పై బీఎన్ఎస్ చట్టంలోని 296(బి) 318(4) సెక్షన్లతోపాటు 3(1)(r)(s), 3(2)(va) ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు.
తనను కొండపల్లి గణేష్ మోసం చేయడంతోపాటు కులం పేరుతో దూషించాడని బాణోత్ గోపీచంద్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైన్ షాపులో పెట్టుబడి పేరుతో, లాభాలు వస్తాయని నమ్మబలికి అమాయక గిరిజనుడైన తాను బ్యాంకులో దాచుకున్న రూ. 64.44 లక్షల మొత్తాన్ని తీసుకుని మోసగించాడని గోపీచంద్ ఫిర్యాదు చేశారు. వీటితోపాటు మరో వైన్ షాపు కొనుగోలు చేశానని రూ. 11.50 లక్షలు తీసుకున్నాడని, తన బాకీ డబ్బులను అడిగేందుకు తాను గత ఫిబ్రవరి 12వ తేదీన తెలిసిన ఇద్దరు వ్యక్తులను వెంటబెట్టుకుని వెళ్లగా, ఇల్లెందులోని గోవింద్ సెంటర్ సమీపాన గణేష్ ఎదురయ్యాడని పేర్కొన్నారు. తనకు ఇవ్వాల్సిన డబ్బు గురించి అతన్ని ప్రశ్నించగా, అసభ్య పదజాలంతో, కులం పేరుతో గణేష్ తనను దూషించాడని, పైగా తనను బెదిరిస్తున్న గణేష్ పై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని గోపీచంద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అభ్యర్థించారు.
ఇదీ చదవండి:
గణేష్ అరెస్టయ్యాడా? పోలీసుల నుంచి తప్పించుకున్నాడా!?
ఇదిలా ఉండగా గోపీచంద్ చేసిన ఫిర్యాదు, ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు నేపథ్యంలో గణేష్ ను ఇల్లెందు పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రచారం కూడా ఆదివారం వ్యాప్తిలోకి వచ్చింది. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో గల గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, అతను చాకచక్యంగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడనే ప్రచారం కూడా ఇల్లెందు పట్టణంలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు గణేష్ పోలీసుల అదుపులోనే ఉన్నాడని కూడా భిన్న ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై ఇల్లెందు సీఐ సురేష్ ను వివరణ కోరేందుకు ‘సమీక్ష’ ప్రయత్నించగా, ఆయన తన ఫోన్లు లిఫ్ట్ చేయలేదు.

