Top 5 This Week

Related Posts

లీగల్, ఛీటింగ్ వివాదాల్లో ఖమ్మం బిగ్ షాట్స్ బిజినెస్!

(సమీక్ష ప్రత్యేక కథనం)
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ప్రముఖుల వ్యాపారాలు లీగల్, ఛీటింగ్ వివాదాల్లో కూరుకుపోతున్న తీరు ప్రజానీకంలో చర్చనీయాంశంగా మారింది. సమాజంలో అత్యంత ప్రముఖులుగా చెలామణిలో గల అనేక మందికి చెందిన వ్యాపారాలు తీవ్ర వివాదాస్పదమవుతుండడం గమనార్హం. ఇందులో కొందరి వ్యాపారాలు న్యాయపరమైన చిక్కులను ఎదుర్కుంటూ, కొనుగోలుదారుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తుండగా, మరికొందరి వ్యాపారాలు మోసపు అభియోగాల్లో చిక్కుకుంటున్నాయి. వీటిని నిర్వహిస్తున్న వ్యక్తులు కొందరు క్రిమినల్ కేసుల్లో నిందితులుగానూ మారుతున్నారు.

ఖమ్మం నగరంలోని ఓ ప్రముఖ వస్త్ర వ్యాపారి ఏడాదిన్నర క్రితం అకస్మాత్తుగా తన సంస్థ షట్టర్ దించేసి మాయమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. దశాబ్ధాలుగా ఖమ్మంలో వ్యాపారం నిర్వహిస్తున్న ఆ వ్యక్తి ప్రజల నుంచి వందలాది కోట్ల రూపాయాలను అప్పులుగా తీసుకుని ఉడాయించినట్లు ప్రముఖంగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వ్యాపారి అటు దివాళా తీసినట్లు ప్రకటించకుండా, ఇటు ప్రజల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించకుండా ఓ దళారిని ఆశ్రయించి అత్యంత చాకచక్యంగా రక్షణ పొందుతున్నారనే ప్రచారం ఉండనే ఉంది. ఈ బాగోతంలో అప్పులిచ్చిన జనం మాత్రమే నష్టపోయారని, ప్రజల నెత్తిన శఠగోపం పెట్టిన వ్యాపారి మాత్రం బ్యాంకాక్ వంటి నగరాల్లో విలాసవంతంగా పర్యటిస్తూ చిల్ అవుతున్నాడనే కథనాలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం

ఈ నేపథ్యంలోనే షట్టర్ దించిన వ్యాపారికి రక్షణగా నిలిచి ఓ ‘దళారి’ ఆస్తులు మాత్రం గడచిన ఏడాదిన్నర కాలంలో విపరీతంగా పెరిగాయనే ప్రచారం కూడా నగరంలో తీవ్ర చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఖమ్మంలోని ఆ వ్యాపారికి చెందిన పలు ఆస్తులను చాకచక్యంగా ఇతరుల పేర్లపైకి మార్చడంలో, తద్వారా లభించిన అనూహ్య ఆర్థిక బలంతో ఆయా దళారి తెలంగాణాలోనేగాక, ఏపీలోని కాకినాడ వంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేగాక బ్యాంకాక్ వంటి నగరాల్లోనూ ఈ దళారి తాజాగా ఆస్తులు కొనుగోలు చేశారనే ప్రచారం ఊపందుకుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జనాన్ని ముంచి వ్యాపార సంస్థ షట్టర్లు దించుకుంటున్న ఈ తరహా వ్యాపారులకు అనేక మందికి ఈ దళారి ఎక్కువగా అండగా నిలుస్తున్నారనే వ్యాఖ్యలు ఉండనే ఉన్నాయి. ఈ ఉదంతంలో తీవ్రంగా నష్టపోయిన బాధితులు దళారి కుటుంబానికి శాపనార్థాలు కూడా పెడుతూ అతని ఇంటిమీద దుమ్మెత్తి పోస్టున్నారట.

కాగా ఖమ్మం నగరంలో రియల్ వ్యాపారం నిర్వహిస్తున్న ‘పారుపల్లి’ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ కూడా లీగల్ వివాదంలో చిక్కుకుంది. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలోని వివిధ సర్వే నెంబర్లలోని దాదాపు 10.05 ఎకరాల్లో నిర్మిస్తున్న నివాస గృహాల వెంచర్ న్యాయపరమైన వివాదాన్ని ఎదుర్కుంటోంది. దమ్మాలపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఖమ్మం రెండో అదనపు కోర్టులో ఈమేరకు దావా దాఖలు చేశారు. ఆస్తి పంపిణీ విభాగాల కోసం దాఖలైన ఈ దావాలో ఆయా వెంచర్ లో నివాస గృహాలను కొనుగోలు చేసినవారితోపాటు రుణాలు అందించిన బ్యాంకులు కూడా ప్రతివాదులుగా మారడం గమనార్హం. ఈ జాబితాలో పేరెన్నిక గల ఓ విద్యా సంస్థ నిర్వాహకులు, రాష్ట్రస్థాయిలో ప్రాచుర్యం గల వ్యాపారవేత్తలు, ఓ జాతీయ బ్యాంకు తదితరులు కూడా ఉన్నారు.

అదేవిధంగా గత వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలోని విఘ్నేశ్వరస్వామి లడ్డూను రూ. 51.00 లక్షలకు దక్కించుకుని రాష్ట్ర వ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందిన కొండపల్లి గణేష్ అనే వ్యక్తి ఛీటింగ్ ఆరోపణల్లో ఇరుక్కున్నారు. ఇల్లెందుకు చెందిన కొండపల్లి గణేష్ తాను ధరించే బంగారు నగల ఆహార్యంతో ‘గోల్డ్ మ్యాన్’గా, లిక్కర్ వ్యాపారం నేపథ్యంలో ‘సిండికేట్ గణేష్’గా పేరుగాంచారు. అధికార పార్టీ తరపున గత మున్సిపల్ ఎన్నికల్లో ఇల్లెందులోని ఓ వార్డులో తన భార్యను మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపించుకున్న కొండపల్లి గణేష్ కు రియల్ ఎస్టేట్, ఇసుక, లిక్కర్ తదితర వ్యాపారాలు ఉన్నాయి.

అయితే లిక్కర్ షాపుల వ్యాపారంలో తమతో పెట్టుబడులు పెట్టించి, కోట్లాది రూపాయల మేరకు మోసం చేశాడని ఖమ్మం నగరానికి చెందిన పలువురు మద్యం వ్యాపారులు ఇల్లెందు పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే బాణోత్ గోపీచంద్ అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కూడా ‘సిండికేట్’ గణేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వద్ద రూ. 64.00 లక్షలు తీసుకుని మోసం చేశాడని, డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినందుకు అసభ్య పదజాలంతో, కులం పేరుతో తనను దూషించడాని గోపీచంద్ ఇచ్చిన ఫిర్యాదుపై ఇల్లెందు పోలీసులు గణేష్ పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కిందనేగాక, మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కొండపల్లి గణేష్ తమను మోసగించాడని ఇల్లెందులోని వైన్ షాపులకు తాళాలు వేస్తున్న భాగస్వామ్య వ్యాపారులు (ఫైల్ ఫొటో)

ఈ పరిణామాల్లో గణేష్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఇల్లెందు పోలీసుల చేతుల్లోనుంచి అతను చాకచక్యంగా తప్పించుకోవడం గమనార్హం. గణేష్ ను అదుపులోకి తీసుకుని ఇల్లెందుకు తీసుకువస్తుండగా, మూత్రవిసర్జన పేరుతో అతను తమ నుంచి తప్పించుకున్నట్లు ఇల్లెందు సీఐ సురేష్ ఓ మీడియా సంస్థతో పేర్కొన్నారు. అయితే వ్యాపారాలు మాత్రమే నిర్వహించే గణేష్ పోలీసుల నుంచి తప్పించుకున్న ఘటన ఇల్లెందు పట్టణ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రముఖ వ్యాపారులుగా ప్రసిద్ధి గాంచిన పలువురి వ్యాపారాలు ఇలా లీగల్ వివాదాల్లో, ఛీటింగ్ ఆరోపణల్లో కూరుకుపోతుండడం సహజంగానే ప్రజల్లో చర్చకు దారి తీస్తోంది.

ఈ తరహా ఉదంతాలపై ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు ‘సమీక్ష’ న్యూస్ తో మాట్లాడుతూ, ‘చూస్తూ ఉండండి ఉమ్మడి జిల్లాలోనే కాదు, ఖమ్మం నగరంలోనూ పలువురి వ్యాపారాల్లో అనూహ్య ఘటనలు జరగబోతున్నాయి. వ్యాపారపరంగా అనేక సంస్థల నడవడిక, పరిస్థితులు, వాటి మనుగడ గాలిబుడగ తరహాలో ఉన్నాయి. అవి ఎప్పుడైనా పేలిపోవచ్చు..’ అని వ్యాఖ్యానించడం కొసమెరుపు.

Popular Articles