Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

వెలుగుమట్ల భూవివాదంలో వరుస కేసుల నమోదు, కల్తీ ‘ఎర్రబాబు’ అరెస్ట్

ఖమ్మం: వెలుగుమట్ల భూ వివాదంలో ఖమ్మం జిల్లా పోలీసులు మరో నాలుగు కేసులు నమోదు చేశారు. దీంతో ఈ అంశంలో ఖానాపురం హవేలీ పోలీసులు నమోదు చేసిన కేసుల సంఖ్య తొమ్మిదికి చేరింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం క్రైం నెం. 101, 102, 103, 104/2026 ద్వారా బీఎన్ఎస్ చట్టంలోని 318 (4) రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద నాలుగు కేసులు నమోదు చేశారు.

ఆయా కేసుల్లోని నిందితులు గ్యాంగ్ గా ఏర్పడి తాము ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమని తప్పుడు ప్రచారం చేశారని ఖమ్మం సిటీ ఏసీపీ రమణమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. అమాయక ప్రజలను ప్రేరేపించి, వారికి ఆశపెట్టి, భూదాన్ భూముల్లో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తామని నిందితులు చెప్పారన్నారు. తద్వారా ఒక్కొక్కరి నుంచి రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు వసూళ్లు చేశారని, భూదాన్, ప్రభుత్వ భూములను ఆక్రమించి, ఆయా స్థలంలో షెడ్లు నిర్మించారని చెప్పారు.

నిందితులు పాల్పడిన ఈ చర్యలవల్ల అనేక మంది మోసపోయారని, భూదాన్ కాలనీ సభ్యుల నుంచి వసూల్ చేసిన డబ్బును వారి స్వప్రయోజనాలకు వాడుకుని, ప్రశ్నించినవారికి భూదాన్ పట్టాలు, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని నమ్మబలికారని ఏసీపీ చెప్పారు. ఈ కేసుల్లో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేయగా, శుక్రవారం కల్తీ ఎర్రయ్య అలియాస్ ఎర్రబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచ్చినట్లు తెలిపారు. మిగతా నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. కాగా భూదాన్ భూములకు సంబంధించి బాధితులు తమ తమ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చని ఏసీపీ రమణమూర్తి సూచించారు.

Popular Articles