Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

పూజల పేరుతో ‘రియల్ ఎస్టేటర్’కు టోకరా, రూ. 55 లక్షల దోపిడీ

హన్మకొండ: అత్యాశ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని నిండా ముంచింది. రెట్టింపు డబ్బు కావాలంటే ప్రత్యేక పూజలు చేయాలంటూ కొందరు వ్యక్తులు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బురిడీ కొట్టించి, అతనికి చెందిన రూ. 55 లక్షలు దోచుకున్న ఘటన హన్మకొండ పట్టణ శివార్లలో జరిగింది. హసన్ పర్తి మండలం దేవన్నపేటకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల వద్ద ఫాం హౌజ్ ఉంది. గత కొంత కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించడంతో డబ్బు సంపాదనపై ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి మల్లగుల్లాలు పడుతున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఒడిషా, మహారాష్ట్రలకు చెందిన కొందరు పూజారులను సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆశ్రయించినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ వ్యాపారి డబ్బు ఆశను పసిగట్టిన పూజారులు, తాము చెప్పిన పూజలు నిర్వహిస్తే డబ్బు రెట్టింపు అవుతుందని నమ్మించినట్లు సమాచారం. దీంతో ఉనికిచెర్లలో గల తన ఫాం హౌజ్ కు ఆయా రాష్ట్రాలకు చెందిన పూజారులను రప్పించి రియల్ ఎస్టేట్ వ్యాపారి పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

పూజల్లో రూ. 55 లక్షల మొత్తాన్ని ఉంచితే రూ. 2.00 కోట్లు అవుతుందని నమ్మించిన పూజారులు రియల్ ఎస్టేట్ వ్యాపారిని మోసగించి ఉడాయించారు. పూజల తంతు ముగిశాక మాయమాటలు చెప్పిన పూజారులు క్రతువులో ఉంచిన రూ. 55 లక్షల డబ్బును తీసుకుని పరారయ్యారు. డబ్బుపై అత్యాశతో దారుణంగా మోసంపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించాడు. ఘటన వాస్తవమేనని, దర్యాప్తు చేస్తున్నామని కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి ‘సమీక్ష’ న్యూస్ కు చెప్పారు.

Popular Articles