Top 5 This Week

Related Posts

‘కర్రెగుట్ట సీక్రెట్’ బట్టబయలు

మావోయిస్టు నక్సలైట్ల కోసం తెలంగాణా-ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ‘ఆపరేషన్ కర్రెగుట్ట’ కొనసాగుతోంది. భారీ సంఖ్యలో మావోయిస్టులు తలదాచుకున్నట్లు భావిస్తున్న కర్రెగుట్టల్లోకి భద్రతా బలగాలు చొచ్చుకుపోతున్నాయి. కర్రెగుట్టలను తమ కంట్రోల్ లోకి తీసుకునేందుకు కోబ్రా, సీఆర్పీఎఫ్, డీఆర్జీ తదితర విభాగాలకు చెందిన పోలీసుల బలగాల తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

కర్రెగుట్టలకు చేరుకుని కూంబింగ్ నిర్వహిస్తున్న సహచరుల్లో పలువురు వడదెబ్బకు గురై ఆసుపత్రుల్లో చేరుతున్నప్పటికీ, భద్రతా బలగాలు ముందుకే వెడుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఆరవ రోజు నిర్వహించిన ఆపరేషన్ కర్రెగుట్ట కార్యక్రమంలో పోలీసు బలగాలు భారీ గుహలను కనుగొన్నాయి. సుమారు వెయ్యి మంది నక్సలైట్లు షెల్టర్ తీసుకునేందుకు వీలుగా ఈ గుహలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

గడచిన కొంత కాలంగా మావోయిస్టులు ఈ గుహల్లోనే షెల్టర్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే భద్రతా బలగాలు ఈ గుహలకు చేరుకునేసరికి అక్కడ నక్సలైట్లెవరూ ఉన్నట్లు రూఢీ కాలేదు. విరామం లేకుండా తమ ఆపరేషన్ ను కొనసాగిస్తుండడంతో మావోయిస్టులు ఆహార సమస్యను ఎదుర్కుంటుండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. కర్రెగుట్టల్లో ప్రస్తుతం కనుగొన్న గుహలు ఇంకా అనేకం ఉండి ఉంటాయని, 70 కిలోమీటర్ల విస్తీర్ణంలో గల కర్రెగుట్టలను పూర్తి ఆధీనంలోకి తీసుకుని గాలించేందుకు భద్రతా బలగాలు సంసిద్ధమవుతున్నాయి.

Popular Articles