కరీంనగర్: తెలంగాణాలో సంచలనం సృష్టించిన కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చోరీ గ్యాంగ్ లో ముగ్గురిని అరెస్ట్ అరెస్ట్ చేయగా, పరారీలో మరో 10 మంది ఉన్నారు. ఈ దోపిడీలో కీలక సూత్రధారి, ప్రస్తుతం జైల్ లో ఉన్న సుభోద్ సింగ్ ‘గోల్డెన్ థీఫ్’గా పేరుగాంచాడని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెల్లడించారు. బీహార్ కు చెందిన కరడుగట్టిన నేరస్థుడు సుభోద్ సింగ్ గ్యాంగ్ కరీంనగర్ జువెల్లరీ షాపులో దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు ప్రకటించారు. ఈమేరకు సీపీ గౌస్ ఆలం గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..
ఈనెల 3వ తేదీన కరీంనగర్ లోని పీఎంజే జువెల్లరీ షాపులో కాల్పులకు పాల్పడిన దోపిడీ ముఠా భారీ చోరీకి పాల్పడిన సంగతి తెలిసిందే. ఘటనలో ప్రత్యక్షంగా ఐదుగురు దొంగలు పాల్గొని 82 లక్షల 2 వేల రూపాయల విలువచేసే 1614 గ్రాముల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ల వజ్రాభరణాలు అపహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం కలగించిన ఘటనపై సీసీ ఫుటేజీ ఆధారంగా కీలక సమాచారం సేకరించిన పోలీసులు, పశ్చిమ బెంగాల్ కి చెందిన రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జాగిరా సింగ్, మెహతాబ్ ఖాన్, బీహార్ కు చెందిన రవీష్ కుమార్ అలియాస్ ప్రద్యుమన్ ను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 51 వేల రూపాయల నగదు, రెండు సెల్ ఫోన్లు రెండు సిమ్ కార్డులు నకిలీ ఆధార్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. అయితే దొంగలు ఉపయోగించిన ఆయుధాలు, చోరీకి గురైన బంగారు ఆభరణాలు మాత్రం రికవరీ కాకపోవడం గమనార్హం.

ఝార్ఖండ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దులో మెహతాబ్ ఖాన్ వద్ద పదివేలు పెట్టి సిమ్ కార్డులు కొనుగోలు చేసి రెండు మాసాల క్రితం తెలంగాణలోకి ప్రవేశించిన ముఠా ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో తిరుగుతూ జ్యువెలరీ షాపులు, బ్యాంకుల పై రెక్కీ నిర్వహించారు. పారిపోవడానికి ఈజీగా ఉన్న కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ ను ఎంచుకొని ఈనెల 3వ తేదీన చోరీకి పాల్పడి పారిపోయారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను గుండాల అటవీ ప్రాంతంలో క్రెటా కారులో వచ్చిన సుభోద్ సింగ్ చెందిన వ్యక్తులకు అప్పగించి రఘునాథ్, మిశ్రా సమీపంలోని రైల్వే స్టేషన్ ద్వారా బీహార్ కు పారిపోయారు.
కేసు దర్యాప్తులో భాగంగా మద్దునూరు వద్ద లభించిన సెల్ఫోన్, ధర్మపురి వద్ద వదిలేసిన బైక్, సిసి కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి ముగ్గురిని అరెస్టు చేశామని సీపీ గౌస్ అలం తెలిపారు. మే 1న ఐదుగురు సభ్యులు ధర్మపురిలోని విజయలక్ష్మి గెస్ట్ హౌస్ లో దిగారని, మే 2న సుభోద్ సింగ్ అనుచరుల సమాచారంతో రఘునాథ్ కర్మాకర్ మంచిర్యాలకు వెళ్లి ట్రైన్ లో చంద్రాపూర్ కు చేరుకోగా అక్కడ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గడ్చందూర్ పరిసరాల్లోకి తీసుకెళ్లి ఆరు పిస్తోళ్ళు, మ్యాగజైన్లు అందజేయగా వాటితో రఘునాథ్ ధర్మపురి కి చేరుకున్నాడని తెలిపారు. మే 3న ధర్మపురి నుంచి కరీంనగర్ కు రెండు బైకులపై చేరుకుని పీఎంజే లో చోరీకి పాల్పడి తిరగబడ్డ సిబ్బందిపై కాల్పులు జరిపి పారిపోయారని సిపి చెప్పారు.

వచ్చిన దారిలోనే ధర్మపురి కి చేరుకున్న దొంగలు సనోజ్, రాధే, ప్రద్యుమన్ గోదావరి నది ఒడ్డున పల్సర్ బైక్ వదిలి నడుచుకుంటూ గోదావరి దాటి మంచిర్యాల నుంచి ట్రైన్ లో పరారయ్యారని తెలిపారు. మరో బైక్ మీద ఉన్న ఇద్దరు రఘునాథ్, మిశ్రా నగలు ఉన్న బ్యాగుతో గుండాల అటవీ ప్రాంతానికి చేరుకోగా అక్కడికి క్రెటా కారులో వచ్చిన వ్యక్తులకు నగల బ్యాగ్, అపాచీ బైక్ అప్పగించి సమీపంలోని రైల్వే స్టేషన్ వెళ్ళి ట్రైన్ లో బీహార్ పారిపోయారని తెలిపారు.
దొంగలు గరుడుగట్టిన నేరస్తుడు ‘ది గోల్డెన్ థీఫ్’గా పేరొందిన సుభోద్ సింగ్ ప్రస్తుతం జైల్లో ఉండగా 100 నుంచి 150 మందికి పైగా తన అనుచరులు పక్కా ప్లాన్ తో చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. తెలంగాణలో ఆ గ్యాంగ్ చోరీకి పాల్పడడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పారు. దేశవ్యాప్తంగా మొత్తం 8 రాష్ట్రాల్లో సుభోద్ సింగ్ గ్యాంగ్ చోరీలకు, హత్యలకు పాల్పడిందని, వారిపై 40 కేసులు ఉన్నాయని సీపీ తెలిపారు. కరీంనగర్ లో చోరీకి పాల్పడ్డ మిగతా వారిని పట్టుకునేందుకు గోల్డ్ రికవరీ చేసేందుకు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని సీపీ గౌస్ ఆలం తెలిపారు.
సీసీ టీవీ ఫుటేజ్, శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో అంతరాష్ట్ర సమ న్వయంతో దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే అందరినీ పట్టుకుంటామనే ధీమాను కరీంనగర్ సీపీ గౌస్ ఆలం వ్యక్తం చేశారు.

