పాలేరు: రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కూసుమంచి మండలం పాలేరులో ఏర్పాటు చేసిన సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి ధాన్యం సేకరణ, తూకం, నాణ్యత ప్రమాణాలు, నిల్వ ఏర్పాట్లు తదితర అంశాలను మంత్రులు పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులు పండించిన చివరి గింజ వరకూ మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రభుత్వం 22 వేల కోట్లతో ఈ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 82 నుంచి 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం హమాలీలు, లారీ వాహనాల కొరత వంటి సమస్యలు ఉన్నాయని మంత్రి తెలిపారు. సాధారణంగా బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హమాలీలు వస్తారని, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు, బీహార్‌లో వ్యవసాయ సీజన్ పొడిగింపు కారణంగా హమాలీల కొరత తీవ్రంగా ఉందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆ సమస్య పరిష్కారానికి అత్యవసర చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
రవాణా సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. వచ్చే 15 రోజుల పాటు లారీలు, డీసీఎంలను ఇతర అవసరాలకు కాకుండా ధాన్యం రవాణాకే వినియోగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ధాన్యం రవాణాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంత్రులు జిల్లాల వారీగా పర్యటిస్తూ కొనుగోళ్ల ప్రక్రియను సమీక్షిస్తున్నారని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

ఏదులాపురంలో ‘ప్రజాదర్బార్’:
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదాలతో ప్రజా ప్రభుత్వం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిందని తెలిపారు. పేద ప్రజలకు అండగా నిలవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే అధికారులను ప్రజల వద్దకు పంపించి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కార చర్యలు చేపట్టామని తెలిపారు. రెండేళ్ల పాలన అనంతరం మళ్లీ ప్రజల వద్దకే అధికారులను పంపిస్తూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.
పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని మూడు క్లస్టర్లుగా, మున్సిపాలిటీని రెండు క్లస్టర్లుగా విభజించి ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 11 క్లస్టర్ల కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. ప్రతి దరఖాస్తుపై అధికారులకు పూర్తి జవాబుదారీతనం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని సమస్యలను ఇక్కడికక్కడే పరిష్కరిస్తామని, మరికొన్ని సమస్యలకు కొంత సమయం పట్టవచ్చని తెలిపారు. అయితే ప్రతి అర్హత గల దరఖాస్తును నిబంధనల ప్రకారం మూడు నెలల్లోగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నామని చెప్పారు

