తెలుగు మీడియా అధినేతకు ఒకరికి పోలీసుల నుంచి పిలుపొచ్చింది. ఓసారి తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న ‘సిట్’ పోలీసులు నోటీసులు జారీ చేశారు. శనివారం రోజు తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఓ తెలుగు న్యూస్ ఛానల్ అధినేత శ్రవణ్ రావును సిట్ పోలీసులు నోటీసులిచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో A6 (ఆరవ నిందితుడు)గా ఉన్న శ్రవణ్ రావు నిరుడు మార్చి 10వ తేదీన తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన వెంటనే విదేశాలకు పారిపోయాడు. మొదట లండన్ కు, ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికాకు పారిపోయాడు. సిట్ విచారణకు హాజరు కాకుండా అమెరికాలోనే ఉండిపోవడంతో, వివిధ పరిణామాల నేపథ్యంలో శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయింది.
అయితే ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం శ్రవణ్ రావు చేసుకున్న దరఖాస్తును తెలంగాణా హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గత 24వ తేదీన విచారణ జరిపిన దేశ అత్యున్నత ధర్మాసనం శ్రవణ రావును పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉపశమనాన్ని ప్రసాదించింది.
అయితే కేసులో పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు విధించిన షరతుకు పిటిషనర్ తరపు న్యాయవాది అంగీకరిస్తూ, అవసరమైతే శ్రవణ్ రావును 48 గంటల్లో ఇండియాకు తిరిగి వస్తారని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే శనివారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని 72 గంటల వ్యవధినిస్తూ సిట్ పోలీసులు శ్రవణ్ కు నోటీసులు జారీ చేశారు.
నోటీసు ప్రతిని ఈనెల 26న హైదరాబాద్ లో గల శ్రవణ్ రావు కుటుంబ సభ్యులకు అందించారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీ ప్రకారం మీడియా అధినేత శ్రవణ్ రావు శనివారం విచారణకు హాజరవుతారా? లేదా? అనేది నేడు తేలనుంది.
Update:
కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యేందుకు మీడియా ఛానల్ అధినేత శ్రవణ్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున రెండు గంటలకు దుబాయ్ నుంచి శ్రవణ్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. మరికాసేపట్లో పోలీసుల ముందు శ్రవణ్ రావు విచారణకు హాజరు కానున్నారు.

