రాష్ట్రంలో సంపదను సృష్టించి నిరుపేదలకు పంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం చిన్న గోపతి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన నాలుగు పథకాల ప్రారంభోత్సవ గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజ్యాంగాన్ని తయారు చేసుకుని నేడు అమలు చేసుకున్న పవిత్రమైన రోజు అని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంటూ ప్రపంచంతో పోటీ పడేలా ఎదిగేందుకు మన రాజ్యాంగం బలమైన పునాదులు వేసిందన్నారు. మన విధులు, జీవన విధానం, మనకు ఉన్న హక్కులు, సమాన అవకాశాలు కల్పిస్తూ బావ స్వేచ్ఛకు సంపూర్ణ హక్కు కలిగిస్తూ భారత రాజ్యాంగం అమలు చేసుకున్నా మని, ఇది మన జీవన విధానమని అన్నారు. పరమ పవిత్రమైన ఈ రోజు 4 నూతన పథకాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ నాలుగు పథకాల క్రింద సంవత్సరానికి ప్రజలకు 45 వేల కోట్లు అందించడం జరుగుతుందని అన్నారు. సాచురేషన్ పద్ధతిలో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.
గతంలో పాలకులు రైతు కూలీలు, పేదలకు ఇండ్ల గురించి ఆలోచన చేయలేదని అన్నారు. నేడు భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేల ఆర్థిక సహాయం, ఇండ్లు లేని చివరి పేద కుటుంబానికి ఇండ్లు ఇచ్చేవరకు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో సంపద సృష్టించి పేదలకు పంచడమే తమ లక్ష్యమని అన్నారు. నాలుగు గోడల మధ్య లబ్ధిదారుల వివరాలు తయారు చేసే పద్ధతికి స్వస్తి చెప్పి గ్రామ సభలు నిర్వహించి పారదర్శకంగా ప్రజల మధ్యలో లబ్ధిదారులను ఎంపిక చేశామని అన్నారు. గ్రామసభలలో ప్రాథమిక జాబితాలో పేర్లు రాని వారి దగ్గర దరఖాస్తులు తీసుకుని, వాటిని కూడా విచారించి అర్హత ఉంటే పథకాలు అమలు చేస్తామని అన్నారు. పథకాల అమలు పట్ల కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలు తిప్పి కొట్టాలని, చివరి లబ్ధిదారుడు వరకు పథకాలు చేరతాయని అన్నారు.

జనవరి 26న ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి సాచురేషన్ పద్దతిలో పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. నేడు మంజూరు పత్రం ఇచ్చిన ప్రతి రైతుకు, రైతు కూలీ బ్యాంకు ఖాతాలో సోమవారం నిధులు జమ అవుతాయని అన్నారు. గత పాలకులు లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదని, తమ ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేసి చూపించామని, సన్న రకం వడ్లకు 500 బోనస్ ఇచ్చామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ ల ఉచిత విద్యుత్, 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మెటిక్ చార్జీలు పెంపు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేసామని అన్నారు.
మహిళలు ఆర్థికంగా స్థిరపడేందుకు పూర్తి సహకారం అందిస్తున్నామని, మహిళా సంఘాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కు ప్రణాళికలు తయారు చేశామని, ప్రభుత్వంలో అవకాశమున్న ప్రతిచోట మహిళలకు ఆదాయం లభించేలా చర్యలు చేపట్టామని అన్నారు. త్వరలోనే రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నరకం బియ్యం సరఫరా చేస్తామని అన్నారు. గతంలో ఉన్న రైతుబంధు బకాయిలు కూడా ప్రజా ప్రభుత్వమే చెల్లించిందని, రైతులకు ఉచిత విద్యుత్ క్రింద విద్యుత్ సంస్థలకు 12 వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామని అన్నారు. ప్రజా సంపదకు కస్టోడియన్ గా ఉంటూ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం మాత్రమే దానినీ వినియోగిస్తామని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు.

