Top 5 This Week

Related Posts

పోక్సో కేసులపై ఖమ్మం పోలీస్ కమిషనర్ కీలక సమీక్ష

ఖమ్మం: పోక్సో కేసులపై ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీలక సమీక్ష నిర్వహించారు. ఈమేరకు మంగళవారం జిల్లా పోలీస్ అధికారులతో ఆయన పోలీస్ కాన్ఫిరెన్స్ హాలులో క్రైం రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్బంగా సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ, పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా పూర్తిచేసి అభియోగపత్రాన్ని నిర్ణీత గడువులోగా న్యాయస్థానంలో సమర్పించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నేర విచారణలో నిందితులకు శిక్షల శాతం పెరగడం అత్యంత ముఖ్యమన్నారు. ఇందుకోసం పకడ్బందీ దర్యాప్తు, శాస్త్రీయ ఆధారాల సేకరణ, పోలీసు-ప్రాసిక్యూషన్ సమన్వయం అవసరమన్నారు. కొత్త చట్టాల ప్రకారం నిర్ణీత గడువులోగా ట్రయల్ పూర్తి చేయాలని, సాక్షులు భయపడకుండా భరోసా కల్పిస్తూ న్యాయస్థానానికి హాజరయ్యేలా చూడాలన్నారు.

ఎన్డీపీఎస్ కేసులలో న్యాయస్థానంలో నేరాన్ని రుజువు చేయడానికి స్వాధీనం చేసుకున్న గంజాయి / మాదకద్రవ్యాల స్వభావం, పరిమాణాన్ని శాస్త్రీయంగా నిర్ధారించే ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ నివేదిక ప్రధాన ఆధారమన్నారు. అదేవిధంగా జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలను అరికట్టడానికి ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ఈగల్ బృందాలు, టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసుల సమన్వయంతో మూలాలను కనిపెట్టాలన్నారు. నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడేవారిపై వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సమావేవంలో పాల్గొన్న ఏసీపీలు, ఇతర పోలీసు అధికారులు

చోరీల నివారణకు, చోరీ సొత్తును బాధితులకు తిరిగి అప్పగించడానికి పోలీసులు సాంకేతికతను ఉపయోగిస్తూ రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నిందితుల గుర్తింపు, రికవరీ వేగవంతం చేయాలన్నారు. విచారణలో భాగంగా ప్రతి కేసును సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్‌ సాక్ష్యాలు, డిజిటల్‌ సాక్ష్యాలను సమర్థవంతంగా వినియోగించి దర్యాప్తు చేపట్టాలని సూచించారు.

శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. నేరాలు జరిగిన తరువాత స్పందించడం కంటే ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడమే సమర్థవంతమైన పోలీసింగ్‌ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. శాంతిభద్రతలు,నేరాల ధోరణి, పోలీస్‌ స్టేషన్ల పనితీరు, పెండింగ్‌ కేసులు, దర్యాప్తు పురోగతి, ట్రాఫిక్‌ నియంత్రణ, సైబర్‌ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలన, కమ్యూనిటీ పోలీసింగ్‌, పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు వివిధ సబ్ డివిజన్ల ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రెడ్డి, వసుంధర యాదవ్, సారంగపాణి, ఫణిందర్, నర్సింహారావు, సర్వర్, సత్యనారాయణ, సాంబరాజు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Popular Articles