Top 5 This Week

Related Posts

‘కేసీఆర్’కు మానస ‘పత్రిక’ బిగ్ షాక్!

మాజీ ముఖ్యమంత్రిగా రాయడానికి కూడా మనస్కరించని కేసీఆర్ మానస ‘పత్రిక’ చివరికి తన లీడర్, తెలంగాణా తొలి ముఖ్యమంత్రి ప్రాధాన్యతను మర్చిపోయిందా? తగ్గించిందా? కేసీఆర్ వ్యాఖ్యలకు అంతగా ప్రాముఖ్యత లేదని ఆ పత్రిక భావిస్తోందా? కేసీఆర్ చెప్పే రాజకీయ జోస్యం అసలు వార్తాంశమే కాదని డిసైడ్ చేసిందా? ఆ.. సారు ఏదేదో మాట్లాడుతుంటారు.. పెద్దగా పట్టించుకోవలసిన అవసరమే లేదని అనుకుంటున్నదా? ప్రముఖ పత్రికలు, టీవీ ఛానళ్లు ఎలాగూ సారు గురించి రాస్తాయిలే.. మనమెందుకు రాయడమని పత్రిక బాధ్యులు భావిస్తున్నారా? ఈ ప్రశ్నలు రేకెత్తడానికి కేసీఆర్ ఇష్టపడి మరీ ఇతరుల నుంచి చేజిక్కించుకున్న ‘నమస్తే తెలంగాణా’ పత్రిక బుధవారంనాటి మెయిన్ ఎడిషన్ తీరుతెన్నులే ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు.

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏది చెప్పినా సంచలన వార్తే. ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో తనను కలిసిన ఏ నాయకుడితో ఏం మాట్లాడినా ప్రాముఖ్యతగల వార్తే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. రాజకీయంగా కేసీఆర్ కు గల ప్రాముఖ్యత అటువంటిది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫాం హౌజ్ కే పరిమితమైన కేసీఆర్ ను ఇటీవలి కాలంలో కొన్ని నియోజకవర్గాల నాయకులు కలుస్తున్నారు. పన్నెండు రోజుల క్రితం జహీరాబాద్ నియోజకవర్గం నేతలు కొందరు తనను కలిసిన సందర్భంగా కేసీఆర్ నోటినుంచి వెలువడిన కామెంట్స్ మీడియాకు ఎంత సంచలన వార్తలుగా మారాయో తెలిసిందే.

‘నేను కొడితే మామూలుగా ఉండదు.. కొడితే గట్టిగనే కొడ్త..’ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు టీవీ ఛానళ్ల స్క్రీన్లు ‘ఫుల్ ప్లేట్ బ్రేకింగ్ న్యూస్’లతో దద్దరిల్లిపోయాయి. పత్రికల్లోనూ వార్తలు ప్రముఖంగానే అచ్చయ్యాయి. కేసీఆర్ మాటలకు గల ప్రాధాన్యత విషయంలో మీడియా ఎప్పుడూ అసక్తికరంగానే ఉంటుంది. తెలంగాణా రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కేసీఆర్ కు మీడియాలో లభించే ప్రాముఖ్యతకు ఎప్పుడూ లోటు ఉండదు. అంతటి కేసీఆర్ ప్రాధాన్యతను తన సొంత పత్రిక పట్టించుకోవడం మానేసిందా? అనే డౌట్ కలగడానికి గల అసలు కారణంలోకి వెడితే..

ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో కేసీఆర్ ను తాటికొండ రాజయ్య కలిసిన చిత్రం

తెలంగాణా తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలుసు కదా? ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి అప్పట్లో రాజయ్యను ఆగమేఘాలమీద తొలగించి, కడియం శ్రీహరిని అదే స్థానంలో కేసీఆర్ నియమించిన తీరు అప్పట్లో రాజకీయంగా పెను సంచలనమే. రాజయ్యను డిప్యూటీ సీఎం పదవి నుంచి దింపడానికి గల అసలు కారణం మాత్రం ఇప్పటికీ బహిర్గతం కాలేదన్నది వేరే విషయం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో టికెట్ కూడా దక్కని వేదనను భరిస్తున్న తాటికొండ రాజయ్యతోపాటు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ గులాబీ పార్టీ కార్యకర్తలు, నాయకులు నిన్న ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను కలిశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పరాజయం పాలు కాక తప్పదని, స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య గెలుస్తారని, బీఆర్ఎస్ జెండాను ఘన్ పూర్ లో తిరిగి ఎగురవేస్తారని కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తాజా పరిణామాల్లో కేసీఆర్ వ్యాఖ్యలు అత్యంత ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

కేసీఆర్ చేసిన ఆయా వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను బుధవారం ప్రముఖ పత్రికలు ప్రాధాన్యతనిస్తూ మెయిన్ ఎడిషన్లలో ప్రచురించాయి. కేసీఆర్ తాజా కామెంట్లను ప్రముఖ టీవీ ఛానళ్లు కూడా నిన్న ‘బ్రేకింగ్’గానే ప్రసారం చేశాయి. కానీ కేసీఆర్ మానస పుత్రికగా బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్న పార్టీ సొంత పత్రిక మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించడమే గులాబీ కేడర్ లో చర్చకు దారి తీసింది. తాటికొండ రాజయ్య కేసీఆర్ ను కలిసిన ఉదంతానికి సంబంధించిన వార్తగానీ, ఫొటోగాని ‘నమస్తే తెలంగాణా’ మెయిన్ ఎడిషన్ లో ఎక్కడా కనిపించలేదు. అటు హైదరాబాద్ ఎడిషన్ లోనే కాదు, చివరికి కేసీఆర్ సొంత ఇలాఖా మెదక్ జిల్లా పేజీల్లోనూ ఇందుకు సంబంధించిన వార్తకోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది.

స్థానిక విలేకరులు కవర్ చేసిన వార్తా కథనం

చివరికి ఓ జర్నలిస్టు మిత్రుడు వ్యక్తీకరించిన డౌట్ తో హన్మకొండ జిల్లా పేజీని వెతికితే ‘ఉప ఎన్నిక ఖాయం మళ్లీ ఎమ్మెల్యే నువ్వే’ అనే శీర్షికతో ఫొటోతో కూడిన వార్త కనిపించింది. ఇందులోనూ గమనించాల్సిన అంశమేమిటంటే..? స్టేషన్ ఘన్ పూర్, వేలేరు మండలాల విలేఖర్లు స్థానిక ప్రాధాన్యతతో మాత్రమే వార్తను కవర్ చేసినట్లు కనిపిస్తోంది. ఉప ఎన్నికలు వస్తాయంటూ కేసీఆర్ చేసిన కీలక వ్యాఖ్యల యావత్తు సారాంశం కాకుండా, స్థానిక నాయకులు అందించిన వివరాలతో మాత్రమే అక్కడి విలేకరులు వార్తను కవర్ చేయడం గమనార్హం.

మొత్తంగా పరిశీలించినపుడు ఈ అంశంలో తేలిందేమిటంటే.. కేసీఆర్ వ్యాఖ్యలకు తన మానస పత్రిక బాధ్యులు పెద్దగా ప్రాముఖ్యతనుగానీ, ప్రాధాన్యతనుగానీ ఇచ్చినట్లు కనిపించకపోవడం. అయితే ఇది యాధృచ్ఛికంగా జరిగిందా? ఉద్ధేశపూర్వకంగా జరిగిందా? అనేది పత్రిక బాధ్యులే తేల్చాలి. ఇదే సందర్భంగా కొసమెరుపు ఏమిటంటే..? రాజకీయంగా ఏమాత్రం పొడగిట్టని సీఎం రేవంత్ రెడ్డిని మంద కృష్ణ మాదిగ నిన్న కలిసిన సందర్భానికి సంబంధించిన వార్తకు, ఫొటోకు ఇచ్చిన కనీస ప్రాధాన్యతను కూడా కేసీఆర్ మాటలకు ‘నమస్తే తెలంగాణా’ పత్రిక ఇవ్వకపోవడం.

Popular Articles