Top 5 This Week

Related Posts

షాపు లేని ‘గోల్డ్’ వసూళ్ల దందా.. దీని భావమేమి రవీంద్రా!?

(సమీక్ష ప్రత్యేక కథనం)
‘సిరి గోల్డ్’ సంస్థపై వస్తున్న గొలుసుకట్టు వసూళ్ల దందాకు సంబంధించిన ఆరోపణల్లో ఇది మరో అంకం. ఈ సంస్థకు చెందిన ‘కోర్’ కమిటీ సభ్యుడొకరు దిగువన గల వీడియోలో చెబుతున్న సారాంశం ఏమిటో తెలుసా?

‘సిరి గోల్డ్’లో చేరిన వ్యక్తి ఓ ఇద్దరు సభ్యులను ‘డూప్లికేషన్’ చేయడం ద్వారా, వాళ్లు కూడా అదే విధంగా చేయడం వల్ల సంవత్సరంలోపు 4,096 మందిని చేర్పిస్తారని చెప్పాడు. ‘లెఫ్ట్-రైట్’ మార్గాల్లో ఇలా చేర్పిస్తే మొత్తం 8,000 వేల మందితో టీం అవుతుందని చెప్పారు. ఈ మొత్తం మందికి రెండుగా విభజిస్తే 4,000 జతలు అవుతారని, జతకు రూ. 3,000 చొప్పున రూ. 1.20 కోట్లు సంపాదించవచ్చంటున్నారు.

వంద శాత పనిచేస్తే ఏడాదిలో కోటి 20 లక్షలు సంపాదించవచ్చని, లేని పక్షంలో పనిలో 50 శాతం ఫలితం సాధించినా రూ. 60 లక్షలు, 25 శాతం విజయవంతమైతే రూ. 30 లక్షలు, కనిష్టంగా 10 శాతం టార్గెట్ రీచ్ అయినా రూ. 10-15 లక్షలు అద్భుతంగా తీసుకునే బెస్ట్ ప్లాట్ ఫారం మన ముందుకు వచ్చిందని సెలవిచ్చారు.

గొలుసుకట్టు విధానంలో లాభాలను వివరిస్తున్న ‘కోర్’ కమిటీ సభ్యుడు

అంతేకాదు చదువు, క్వాలిఫికేషన్, అనుభవం గురించి అడగడం లేదని, పీజీలు, పీహెచ్ డీలు, ఎంటెక్, హైటెక్కులు అవసరమే లేదని, మాటలు వచ్చి, మనుషులు తెలిసి ఉంటే చాలని చెబుతూ తెల్లబోర్డుపై సంపాదన లెక్కలు వేసి మరీ వివరించారు. ఇది అతను చెప్పిన విషయంలోని కొంత సారాంశం మాత్రమే.

సభ్యుల ‘డూప్లికేషన్’లో లింక్ తెగిపోయినప్పటికీ, దినసరి రూ. 51 వేల చొప్పున నెలసరి రూ. 15.50 లక్షలు సంపాదించుకునే మార్గాన్ని కూడా వివరిస్తూ ‘సిరిగోల్డ్’ సంస్థలో రూ. 15,000 అడ్వాన్స్ పర్చేజ్ సంగతినీ ప్రస్తావించారు. ఇందుకు గల షరతులనూ వెల్లడించారు. మొత్తం విషయాన్ని గ్రహించేందుకు దిగువన గల వీడియో లింక్ లోని ‘కోర్’ కమిటీ సభ్యుడు చెప్పిన వివరాల పాఠాన్ని వినవచ్చు.

ఇదీ ‘సిరిగోల్డ్’ సంస్థ చేస్తున్నట్లు ఆరోపణలు గల గొలుసుకట్టు దందాలోని వీడియోలోని కథ. మొత్తంగా ఈ వ్యవహారంలో స్పష్టమవుతున్నదేమిటి? గోల్డ్ పర్చేజ్ పేరుతో సంస్థ నిర్వాహకులు సభ్యులతో షరతులతో కూడిన బంగారం కొనుగోలుకు సంబంధించి ముందస్తు పెట్టుబడులు పెట్టిస్తున్నారనేది తేటతెల్లం.

ఇవే అంశాలు ప్రామాణికంగా యాసా నాగేశ్వర్ రావు అనే వ్యక్తి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. చెప్పిన ప్రకారం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండా, వేలాది మందితో అక్రమంగా డబ్బును డిపాజిట్ల రూపంలో తీసుకుంటున్నారని, స్కీంలో పేర్కొన్న ప్రకారం గోల్డ్ షాప్ పెట్టలేదని, ఇచ్చిన కూపన్లు వినియోగించుకునేందుకు వెబ్ పోర్టల్ కూడా లేదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా రూ. 15.00 నుంచి రూ. 20 కోట్ల వరకు ప్రజల నుంచి వసూళ్లు చేశారని యాసా నాగేశ్వర్ రావు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఉటంకించారు. ఈ ఫిర్యాదు ప్రకారమే బీజేపీ నేతలు నెల్లూరి కోటేశ్వర్ రావుపైన, కూసంపూడి రవీంద్రపైన పోలీసులు కేసు నమోదు చేశారు.

గొలుసుకట్టు విధానంలో లాభాలను బోర్డుపై చెబుతున్న ‘కోర్’ కమిటీ సభ్యుడు

వాస్తవానికి ముందస్తు పెట్టుబడుల విషయంలో ఒకటీ, రెండు ప్రముఖ జువెల్లరీ షాపుల నిర్వాహకులు కూడా గోల్డ్ ‘స్కీం’లు నిర్వహిస్తున్నారు. పెట్టిన పెట్టుబడులకు ఆరు నెలల తర్వాత గోల్డ్ కొనుగోలు చేస్తే 50 శాతం తరుగుతో, ఏడాది తర్వాత తీసుకుంటే తరుగు లేకుండా బంగారం ఇస్తామని ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.

కానీ ఇటువంటి స్కీంలు నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థలకు పేరుగాంచిన నగల షాపులు భౌతికంగా ఉన్నాయి. ముందస్తు పెట్టుబడులు పెట్టినవారికి ఇచ్చేందుకు కళ్ల ముందు నగల షాపు కనిపిస్తోంది. కానీ ‘సిరి గోల్డ్’ సంస్థకు ఇప్పటి వరకు ఎటువంటి నగల షాపు లేకపోవడం గమనార్హం. గడచిన మూడేళ్లుగా వేలాది మంది నుంచి రూ. 15,000 చొప్పున ‘గోల్డ్ పర్చేజ్’ స్కీం పేరుతో సేకరించిన కోట్ల రూపాయలకు గ్యారంటీ ఏమిటనే ప్రశ్న కూడా ఈ సందర్భంగా ఉద్భవిస్తోంది.

కూసంపూడి రవీంద్ర

Popular Articles