Top 5 This Week

Related Posts

భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి

ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం పర్యటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో రూ.1.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.

అదేవిధంగా మంగయ్యబంజార గ్రామంలో రూ.45 లక్షలతో నిర్మించనున్న గ్రావెల్ రోడ్డు, కల్వర్టు, సీసీ రోడ్డు, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి కొత్తగా 24 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పొకలగూడెంలో రూ.60 లక్షల వ్యయంతో నాలుగు అంతర్గత సీసీ రోడ్ల పనులను ప్రారంభించి, ఈ గ్రామానికి ఇప్పటికే 77 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని తెలిపారు. రావికంపాడులో రూ.20 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్ల పనులకు భూమిపూజ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మిగిలిన అంతర్గత రహదారులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

అన్నపురెడ్డిపల్లి మండలంలో రూ.2.77 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర వికాసానికి, మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యమిస్తోందని మంత్రి పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా గుంపెన గ్రామంలో రూ.45 లక్షలతో 9 అంతర్గత సీసీ రోడ్ల పనులకు, నరసాపురంలో ఉపాధి హామీ నిధులు రూ.117.30 లక్షలతో సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి భూమిపూజ చేశారు.

భీమునిగూడెంలో రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఆయన, కోండాయిగూడెం డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో రూ.20 లక్షలతో, పెద్దిరెడ్డిగూడెంలో రూ.75.50 లక్షలతో చేపట్టే రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్‌, ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్డీవో మధు, హౌసింగ్ పీడీ, జిల్లా పంచాయతీ అధికారి అనూష, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అనంతరం ఖమ్మం జిల్లా కల్లూరులో నిర్వహించిన సత్తుపల్లి నియోజకవర్గ ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సత్తుపల్లి క్లస్టర్ ప్రజా దర్బార్‌లో మొత్తం సుమారు 3,500 దరఖాస్తులు అందాయని మంత్రి తెలిపారు. ఇందులో 1,800 ఇందిరమ్మ ఇళ్లకు, 500 వరకు రెవెన్యూ సమస్యలకు, 200 పెన్షన్లకు, ఇతర మిగతా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయని చెప్పారు. ఇదే విధంగా పాలేరు నియోజకవర్గ ప్రజా దర్బార్‌లో 25 వేల దరఖాస్తులు అందగా, వాటిలో 13 వేల దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినవేనని తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భూ రీ-సర్వేతో ఏడాదిన్నరలో రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని, అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, డిఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్, కల్లూరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నీరజ, కల్లూరు మునిసిపాలిటీ చైర్మన్ మోహన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Popular Articles