హైదరాబాద్: విద్యాశాఖ మంత్రిగా తానెందుకు దిగిపోవాలని, ఎందుకు రాజీనామా చేయాలని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణాలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడని నిన్న మొన్న కొందరు మాట్లాడుతున్నారని, అర్జంటుగా రేవంత్ రెడ్డి విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రిని నియమించాలంటున్నారని, తాను ప్రతిభ చూపినందుకు విద్యాశాఖ నుంచి తొలగాలా? అని ఆయన ప్రశ్నించారు.
‘టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్’ లో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో విద్యా అధ్యయన పర్యటన పూర్తి చేసుకున్న ప్రతినిధులతో హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ దాశరథి ఆడిటోరియంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “కొందరు విద్యా మంత్రి తప్పుకోవాలని, దిగిపోవాలని మాట్లాడుతున్నారు. టీమ్ లీడర్‌గా నేను విద్య మీద ఫోకస్ పెట్టాను. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రవేశపెట్టాం. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్ అమలు చేశాం. 14 ఏళ్లుగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు లేకపోతే 23 వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా, 30 వేల మందికి పైగా టీచర్లను బదిలీ చేశాం. ఐటీఐలను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ)గా మార్చాం. ఇవన్నీ చేసినందుకు దిగిపోవాలా” అని ప్రశ్నించారు.
అదేవిధంగా 2023 డిసెంబర్‌కు ముందు కూడా ఇప్పుడున్న ఉపాధ్యాయులే ఉన్నారని, 2014 నుంచి 2023 వరకు ప్రతి ఏడాది ఎందుకు ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల సంఖ్య తగ్గింది? 2024 నుండి ఎందుకు పెరుగుతుంది? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఫోకస్ దేనిపైన ఉంటుందో యంత్రాంగం ఫోకస్ కూడా దానిపైనే ఉంటుందని సీఎం అన్నారు.
‘మీరు ఏదీ అడగాల్సిన పనిలేదు. మీ బదిలీలు, మీ ప్రమోషన్స్ మీ ఇంటికి పంపించాం. డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాలను కేవలం 55 రోజుల్లో భర్తీ చేశాం. ఈ ప్రభుత్వం మీది. మీ కోసం పని చేస్తుంది. మీ సమస్యలను పరిష్కరించే పూచీ నాది. ఉపాధ్యాయ సంఘాలు పిల్లల సమస్యలపై ప్రభుత్వంతో కొట్లాడాలి. వచ్చే ఐదేళ్లలో ఈ విద్యా విధానాన్ని మారుస్తాం’ అని సీఎం వెల్లడించారు.

