ఖమ్మం: భూ భారతి పోర్టల్ లో తలెత్తుతున్న సమస్యలపై తెలంగాణా రెవెన్యూ మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అయితే భూ భారతి అమల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ప్రజల అంచనాలకు పూర్తిస్థాయిలో చేరలేకపోయామని ఆయన వ్యాఖ్యానించారు. ధరణి ‘కాలమ్’లో పెండింగ్‌లో ఉన్న 9.26 లక్షల సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం భూ భారతిలో అవకాశం కల్పించి, హైకోర్టు సమస్యను కూడా పరిష్కరించినప్పటికీ అధిక సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. ఈ తిరస్కరణలకు గల కారణాలను గుర్తించి పరిష్కరించాలని మంత్రి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
భూ రీ-సర్వే, భూ భారతి చట్టం అమలు, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్లు, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీ, పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై మంత్రి శనివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే భూ రీ-సర్వే తప్పనిసరి అని మేధావులు సూచించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇందు కోసం శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని, రెగ్యులర్ సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
లైసెన్స్ సర్వేయర్లకు ఉద్యోగం లేదా రెగ్యులరైజేషన్ హామీ ఇవ్వలేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్టుగా నక్షాలు లేని 413 ప్రాంతాల్లోని ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ-సర్వేతో 95 శాతం వరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి ములుగుమాడు గ్రామ రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లు పంపిణీ చేశారని గుర్తు చేశారు.
రీ-సర్వేకు అవసరమైన అత్యుత్తమ నాణ్యతగల పరికరాలను జిల్లా స్థాయిలో కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలుకు ముందు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్లు భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని అవసరమైన సిబ్బంది,పరికరాలు, మౌళిక వసతులు సమకూర్చాలని ఆదేశించారు.
ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని సమీక్షిస్తామని, మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ. 50తో పాటు రవాణా, ఇతర ఖర్చుల కోసం మరో రూ.10 చెల్లించి మొత్తం రూ.60 అందజేస్తామని తెలిపారు. చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

విధుల్లో చేరని లైసెన్స్ సర్వేయర్లకు గడువిచ్చి, గడువులోగా చేరని వారి లైసెన్సులు రద్దు చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. లైసెన్స్ సర్వేయర్లకు బీమా, సామాజిక భద్రత కల్పించే చర్యలు కూడా తీసుకుంటామని వెల్లడించారు. ఒక సర్వే నంబరులో కొంత భూమి మాత్రమే ప్రభుత్వ అవసరాలకు సేకరించినప్పటికీ మొత్తం భూమిని నిషేధిత జాబితాలో ఉంచడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా సాదాబైనామా దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించి నోటీసులు త్వరిత గతిన జారీ చేయాలని సూచించారు.
మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న 2బీహెచ్‌కే ఇళ్లను ప్రస్తుత స్థితిలోనే లబ్ధిదారులకు అందజేసి, మిగిలిన పనులకు నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. నిధులు విడుదలైనా పనులు చేపట్టని చోట్ల బాధ్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వెంటనే పూర్తి చేసి గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, మొదటి విడతలో మంజూరు కాని అర్హుల ఇళ్లను కూడా రెండవ విడతలో చేర్చి మంజూరు చేయాలని సూచించారు. ఇసుక, కంకర సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు, వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

