పుదుచ్చేరి: తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పుదుచ్చేరి పీసీసీ చీఫ్ విద్యలింగం, మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి భట్టి మనవేలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనంతరామన్, ఎంబాలం నియోజకవర్గంలో లక్ష్మీకాంతన్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగం మనకు కల్పించిన గౌరవం, స్వేచ్ఛను కాపాడుకోవాలంటే కాంగ్రెస్, డీఎంకే కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ‘కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురండి- పుదుచ్చేరిని రక్షించండి’ అని ఓటర్లకు డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. కాంగ్రెస్, డీఎంకే పార్టీలతో కూడిన కూటమి ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉంటుందని భరోసా ఇచ్చారు. తమ కూటమి హామీల అమలుపై ఎన్డీఏ కూటమి చేస్తున్న అసత్యాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. పుదుచ్చేరి బంగారు భవిష్యత్తుకు ఎస్పీఏ కూటమిని గెలిపించడం ఒక్కటే పరిష్కార మార్గమన్నారు.
గ్యారంటీలు అమలు సాధ్యమా? అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమేనని డిప్యూటీ సీఎం అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి క్యాబినెట్ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. తమ రాష్ట్రంలో 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ.21 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సాగు చేసుకునే రైతులకు ఎకరాకు రూ.12 వేలు చొప్పున ఏడాదికి రూ.18 వేల కోట్ల మొత్తాన్ని రైతు భరోసా కింద అందజేస్తున్నామన్నారు.
తాము అధికారంలోకి వచ్చాకి 67,173 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, వివిధ శాఖల్లో నియామకాలు పూర్తి చేయడంతో పాటు ప్రజల సమక్షంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశామని డిప్యూటీ సీఎం వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, 10 వేల బస్సులు, 50 వేల సిబ్బందితో ఉన్న ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఆదా అవుతోందన్నారు.
అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మహిళలను బస్సుల యజమానులుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ -2047 ప్రకారం తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపనున్నట్లు చెప్పారు. తెలంగాణ వృద్ధిరేటు 10.8 శాతంగా ఉందని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్యమని తాము నిరూపించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు.

