హైదరాబాద్: తెలంగాణా అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రెండు రోజులపాటు సస్పెన్షన్ వేటు వేశారు. సభా కార్యక్రమాలు సాగకుండా అడ్డుకుంటున్నారని, వారిని సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
దీంతో బీఆర్ఎస్ కు చెందిన కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాసయాదవ్, జి. జగదీష్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, మాధవరం క్రిష్ణారావు, లక్ష్మారెడ్డి, మాణిక్ రావు, మహిపాల్ రెడ్డి, చింతా ప్రభాకర్, పద్మారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎం. రాజశేఖర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కాలేరు వెంకటేష్, విజయుడు, కేపీ వివేకానంద, అనిల్ జాదవ్, కోవా లక్ష్మిలపై సస్పెన్షన్ వేటు వేశారు.
అదేవిధంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి విషయంలో వ్యవహరించిన ప్రవర్తనా తీరును ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని కూడా అసెంబ్లీ తీర్మానించింది.
కాగా ‘తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత’ అనే బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వృద్ధ తల్లిదండ్రులకు పిల్లలు అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ చట్టం తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో చెప్పారు.

