ఖమ్మం: హనీ ట్రాప్ వలలో చిక్కుకుని ఓ వ్యాపారవేత్త చిక్కుకుని భారీ ఎత్తున మోసపోయిన ఉదంతమిది. కేసు తీవ్రత, బాధితుడు కోల్పోయిన మొత్తం ప్రామాణికంగా స్థానికంగా ఏ పోలీస్ స్టేషన్ లోనూ నమోదు కాని ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని రూ. 2.00 కోట్లు కోల్పోయిన ఓ వ్యాపారవేత్త ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు నిందితులను తణుకు పట్టణంలో ఖమ్మం జిల్లా పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను వ్యాపార వర్గాలు మరువకముందే మరో వ్యాపారి హనీ ట్రాప్ లో చిక్కుకుని పెద్ద మొత్తంలో నగదు కోల్పోయిన ఉదంతం జిల్లా వ్యాపార వర్గాల్లో కలకలం రేపుతోంది.
‘సమీక్ష’కు అందిన సమాచారం ప్రకారం.. సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన ఓ వ్యాపార వేత్తకు మహిళ ఒకరు పరిచయమయ్యారు. ఇరువురి మధ్య ఫోన్ కాల్స్ ద్వారా కాస్త పరిచయం పెరిగిన నేపథ్యంలోనే ఆ మహిళ వలపు వలను విసిరి ఆ వ్యాపారవేత్త నుంచి రూ. 6.00 కోట్ల మొత్తాన్ని దశలవారీగా చేజిక్కించుకుని ఉడాయించినట్లు తెలుస్తోంది. తమకు సన్నిహితులైన వ్యక్తుల కంపెనీల్లో పెట్టుబడుల పేరుతో ఆ మహిళ వలపు వల ద్వారా బాధిత వ్యాపారినుంచి రూ. 6.00 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లు సమాచారం.
అయితే ఆయా భారీ మొత్తపు హనీ ట్రాప్ ఘటనపై కేసు నమోదు చేసే పరిధి, అధికారం స్థానికంగా లేకపోవడంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు బాధితుని తరపున బంధువులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా వ్యాపారులే లక్ష్యంగా అటు సైబర్ నేరగాళ్ల, ఇటు మహిళ హనీ ట్రాప్ వంటి ఛీటింగ్ ఘటనలు వెలుగులోకి వస్తున్న ఉదంతాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ ఘటనపై జిల్లాలో ఎటువంటి కేసు నమోదు కాలేదని, వ్యవహారం తమ పరిధిలోకి రాదని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

