హైదరాబాద్: తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొంటున్న ‘ప్యూచర్ సిటీ’ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం చెబుతున్న ఫ్యూచర్ సిటీ సాంకేతికంగా సాధ్యపడదని ఆయన అన్నారు. పార్లమెంట్ చట్టం చేసినటువంటి ప్రతిపాదిత ‘ఫార్మా సిటీ’ తప్ప, మరే ఇతర ప్రాజెక్టు అక్కడ నిర్మించినా చెల్లబోదన్నారు. ఇదే దశలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించారు. అమెరికా పర్యటనలో గల హరీష్ రావు అక్కడ మీడియాతో మాట్లాడారు.
ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ ప్రభుత్వం డ్రామా చేస్తోందని, ఏ అవసరం కోసమైతే భూసేకరణ జరిపారో, అదే అవసరానికి మాత్రమే భూములు వినియోగించాలని, అందుకు విరుద్ధంగా జరిగితే సేకరించిన భూములు తిరిగి రైతులకు ఇవ్వాలని పార్లమెంట్ చట్టం చేసిందని గుర్తు చేశారు. ఫార్మా సిటీ అవసరం కోసమే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందన్నారు. ఇదే అంశంలో హైకోర్టు లో కేసు విచారణకు వచ్చిన సందర్భంగా ఫార్మా సిటీ కంటిన్యూ చేస్తున్నామని రేవంత్ ప్రభుత్వం కోర్టుకు చెప్పిందని హరీష్ రావు పేర్కొన్నారు.
అసలు విషయం ఇదేనని, రేవంత్ సర్కార్ కేవలం జిమ్మిక్కు చేస్తోందన్నారు. ఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధంగా కనీస సౌకర్యాలైన ఎడ్యుకేషన్, హౌజింగ్సిం ప్రయత్నం చేస్తున్నారని, 75 శాతం ఫార్మా సిటీగా, 25 శాతం మిగతావి ఉండాలని చట్టం ఉందని, కానీ 75 శాతం మిగతా వ్యాపారాలకు, కేవలం 25 శాతమే ఫార్మా వచ్చేలా చేస్తున్నారని, ఇది చట్ట ప్రకారం చెల్లదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు.
ఫార్మా సిటీ వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని తాము ప్రారంభించామని, మన దగ్గర నుంచి ఒక్క ఫార్మా కంపెనీ కూడా బయటికి వెళ్లొద్దనే యోచనతో తాము అలా చేశామని చెప్పారు. రేవంత్ ప్రభుత్వానికి ఇప్పటికే రెండున్నర ఏళ్లు గడిచిపోయిందని, చివరి ఏడాది ఎలక్షన్ సందడి ఉంటుందని, అందువల్ల ఈ అంశంలో రేవంత్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. భూములు పంచి పెడితే బ్యాక్ ఎండ్ ఏదో లబ్ది పొందాలని ప్లాన్ చేశారని, ఫార్మా సిటీ అభివృద్ది చెందితే బీఆర్ఎస్ కు పేరు వస్తుందని ఇలా చేశారని, ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఫార్మా సిటీనే వస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు.

