Top 5 This Week

Related Posts

అవినీతి కేసులో అదనపు ఎస్పీ అరెస్ట్

హైదరాబాద్: అవినీతి కేసులో తెలంగాణా ఏసీబీ ఓ అదనపు ఎస్పీని బుధవారం అరెస్ట్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, ప్రస్తుతం సస్పెన్షన్ లో గల అదనపు ఎస్పీ ఎన్. భుజంగరావును ఏసీబీ అధికారులు ఈమేరకు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగంపై కేసు నమోదు చేసిన ఏసీబీ తనిఖీల అనంతరం అతన్ని అరెస్ట్ చేయడం గమనార్హం.

ఏసీబీ జాయింట్ డైరెక్టర్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. అవినీతి నిరోధక చట్టం –1988 (2018 సవరణలతో)లోని సెక్షన్ 13(1)(బి), 13(2) కింద కేసు నమోదు చేశారు. భుజంగరావు నివాసంతో పాటు ఆయన బంధువుల, బినామీల, ఇతర అనుబంధ వ్యక్తులకు చెందిన మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 27.29 ఎకరాల వ్యవసాయ భూములరె, ఐదు ఖాళీ ప్లాట్లు, రెండు ఇళ్లు, అలాగే హైదరాబాద్‌లో ఒక వాణిజ్య భవనానికి సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అంతేగాక భుజంగరావు నివాసంలో రూ.3.83 లక్షల నగదు, రూ.8 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం, సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, ఒక మారుతి స్విఫ్ట్ కారు, ఒక కియా సెల్టోస్ కారు గుర్తించారు. ఆయా సోదాల తర్వాత ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ రూ. 5.92 కోట్లకు పైగా (రూ.5,92,54,500)గా అంచనా వేసినట్లు పేర్కొంది. అయితే స్థిరాస్తుల మార్కెట్ విలువ పత్రాలలో నమోదైన విలువ కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా అధికారులు తెలిపారు.

కాగా సోదాల సమయంలో భుజంగరావు నివాసంలో 29 మద్యం సీసాలను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ అంశంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు ఏసీబీ వెల్లడించింది. మరిన్ని ఆస్తుల వివరాలపై విచారణ కొనసాగుతోందని, కేసు దర్యాప్తులో ఉందని ఏసీబీ తెలిపింది. నిందితుడైన అధికారిని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్ కోరనున్నట్లు పేర్కొంది.

Popular Articles