హైదరాబాద్: తెలంగాణాలో భూముల మార్కెట్ విలువల సవరణను శాస్త్రీయంగా, హేతుబద్ధంగా చేపట్టినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం చెప్పారు. ఈనెల 5వ తేదీ నుంచి భూముల కొత్త విలువల నిర్ణయం అమలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
రాష్ట్రంలో భూముల విలువలు కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చు తగ్గులున్నట్లు తెలిపారు. అందుకు భూముల ధరలను క్రమబద్ధీకరించాలని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన, ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రమణ్యం ఇచ్చిన నివేదిక ప్రకారం, ఉన్నతాధికారుల సూచనలను, సలహాలను పరిగణనలోకి తీసుకుని విస్తృత స్థాయిలో ఈ అంశంలో అధ్యయనం నిర్వహించామని పేర్కొన్నారు.
ప్రాంతాల అభివృద్ధి సామర్థ్యం, వృద్ధి రేటు, ఇటీవల జరిగిన భూముల వేలం, మార్కెట్ పరిస్థితులు, డిమాండ్, కొత్త రహదారులు, వృద్ధి కారిడార్లు, ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR), పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కెట్ విలువలను నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. ఇందులో భాగంగానే ఈ నెల 5వ తేదీ నుంచి సవరించిన భూముల కొత్త విలువలు అమలులోకి రానున్నాయని చెప్పారు.
అనేక మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ కావడం, గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడం వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆర్సీసీ, నాన్-ఆర్సీసీ నిర్మాణాల రేట్లను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సవరించామన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా, వాస్తవ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సవరణలు చేపట్టామని చెప్పారు. భూ లావాదేవీలలో పారదర్శకత పెంపు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

