ఖమ్మం: వ్యవసాయం నుంచి తాగునీటి వరకు ప్రతి రంగంలో ముందస్తు ప్రణాళిక అవసరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖరీఫ్-2026 వ్యవసాయ ప్రణాళిక, ఖమ్మం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై బుధవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖరీఫ్-2026 సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో అన్ని ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వచ్చే వారం నుంచే రైతు వేదికల ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాలు, ఇతర సాగు ప్రాంతాలను గుర్తించి రైతులకు తగిన ప్రత్యామ్నాయ పంటలను సూచించాలని తెలిపారు.
అదేవిధంగా ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను పునఃసమీక్షించాలని, స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని రైతు వేదికల ద్వారా ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఆయిల్ పామ్ సాగులో దేశంలో అగ్రస్థానంలో ఉందని, ఖమ్మం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందన్నారు. మరో మూడు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా తెలంగాణను మరింత ముందంజలో నిలిపేందుకు అధికారులు, రైతులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. నగర సుందరీకరణ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్ల విస్తరణను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సూచించారు. ప్రజల అంగీకారం ఉన్న ప్రాంతాల్లో నగర అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణ మాస్టర్ ప్లాన్ ప్రకారం చేపట్టాలన్నారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఐదు యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ విద్యా సంస్థల పనులను వేగవంతం చేయాలని సూచించారు.
ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి దయానంద్, అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డిఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

