Top 5 This Week

Related Posts

కర్రెగుట్టల్లో జాగ్రత్త.. అటువైపు వెళ్లొద్దు: బీజాపూర్ పోలీసుల హెచ్చరిక

బీజాపూర్: ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా భాసిల్లిన ఛత్తీస్ గఢ్-తెలంగాణా రాష్ట్రాల సరిహద్ధుల్లోని కర్రెగుట్టలపై బీజాపూర్ పోలీసులు తాజా హెచ్చరికలు జారీ చేశారు. కర్రెగుట్టల సమీపంలోని అడవుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన నక్సల్స్ కు చెందిన భారీ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితుల్లో పోలీసులు ఈ తాజా హెచ్చరికను జారీ చేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం గమనార్హం. కర్రెగుట్టల సమీపంలో 711 బ్యారెల్ గ్రెనేడ్ లాంఛర్ షెల్స్ ను భద్రతా బలగాలు గురువారం స్వాధీనం చేసుకున్నాయి.

ఈ అంశాన్ని అధికారికంగా వెల్లడించిన పోలీసులు ప్రస్తుత పరిస్థితుల్లో కర్రెగుట్టల ప్రాంతానికి ఎవరూ వెళ్లొద్దని సూచించారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలు ఒకప్పుడు మావోయిస్టు అగ్రనేతలకు సురక్షితమైన షెల్టర్ జోన్ గా ఉండేవి. అయితే గత మార్చి 31వ తేదీన ఛత్తీస్‌గఢ్‌ను సాయుధ మావోయిస్టుల ఉనికి లేని రాష్ట్రంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఖచ్చితమైన సమాచారం మేరకు బీజాపూర్ జిల్లా పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కు చెందిన 196వ బెటాలియన్, కోబ్రా (CoBRA)కు చెందిన 204వ బెటాలియన్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగానే ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తడపల్ల గ్రామంలో గల భద్రతా దళాల ‘ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్’ (FOB) చుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా, కర్రెగుట్ట అటవీ సమీపంలో మావోయిస్టులకు చెందిన డంపులో 711 BGL షెల్స్ లభ్యమయ్యాయని ఛత్తీస్ గఢ్ పోలీసులు వెల్లడించారు.

బ్యారెల్ గ్రెనేడ్ లాంఛర్ (BGL) షెల్స్ పేలుడు పదార్థాలతో కూడిన మందుగుండు సామగ్రి. ఇవి వాహనాలు, మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం కలిగించడమే కాకుండా, ప్రాణాంతక గాయాలకు కూడా కారణమవుతాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కర్రెగుట్టల ప్రాంతంలో మందుపాతరలు (IEDs), ఇతర పేలుడు పదార్థాలు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కర్రెగుట్టలు, దాని పరిసర ప్రాంతాలకు వెళ్లకూడదని, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రణాళికాబద్ధమైన చర్యల్లో భాగంగా, ఈ ప్రాంతంలో బాంబులను తొలగించే (demining) ప్రక్రియను చేపడతామని ఛత్తీస్ గఢ్ కు చెందిన ఓ పోలీసు అధికారి చెప్పారు. కాగా నిరుడు ఏప్రిల్-మే నెలల్లో కర్రెగుట్టల చుట్టూ గల దట్టమైన అడవుల్లో భద్రతా దళాలు 21 రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించాయి. ఆ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్ ఘటనల్లో కనీసం 31 మంది మావోయిస్టులు మరణించారు. అనంతరం నిరుడు నవంబర్‌లో భద్రతా దళాలు ఈ ప్రాంతంలో ఒక బేస్ క్యాంపును కూడా ఏర్పాటు చేశాయి.

Popular Articles