Top 5 This Week

Related Posts

ఖమ్మం కలెక్టర్ ను ఆలింగనం చేసుకుని తుమ్మల ప్రశంస

సత్తుపల్లి: ఉత్కంఠ, ఉద్వేగం అనంతరం ఊపిరి పీల్చుకున్న ఘటనలో తెలంగాణా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని గుండెనిండుగా ప్రశంసించారు. ‘వెరీగుడ్ కలెక్టర్’ అంటూ అభినందించారు. బేతుపల్లి చెరువులో SDRF, అగ్నిమాపక విభాగాలకు చెందిన పోలీసులు, సిబ్బంది సహా 11 మంది నిన్న గల్లంతైన ఘటనా స్థలి ప్రదేశంలోనే గత రాత్రి మొత్తం మకాం వేసి సహాయక చర్యలు చేపట్టిన కలెక్టర్ దివాకరను మంత్రి తుమ్మల ఆలింగనం చేసుకుని ప్రశంసించిన దృశ్యాలు ఇవి.

ఈ ఉదంతంలో ఏదేని విషాదం జరుగుతుందేమోనని అందరూ ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో పోలీసులు సహా మొత్తం 16 మంది ప్రాణాలను వరద నీటి నుంచి రక్షించడంలో అధికార యంత్రాంగం సమర్ధవంతతను ప్రదర్శించినట్లు తుమ్మల కీర్తించారు. సమన్వయంతో, అప్రమత్తతో నీటిలో కొట్టుకుపోతున్నవారి ప్రాణాలను రక్షించడంలో విజయవంతమైన అధికార బాధ్యతను నిర్వర్తించిన కలెక్టర్ ను మంత్రి తుమ్మల భావోద్వేగంతో హత్తుకుని అభినందించారు.

అదేవిధంగా SDRF, NDRF సిబ్బందిని మంత్రి తుమ్మల సత్తుపల్లి ఫారెస్ట్ గెస్ట్ హౌజ్ లో సన్మానించారు. ప్రాణాలను కాపాడడంలో ఆయా విభాగాల సిబ్బంది పోరాట ప్రతిమ అమోఘమని, వారికి జీవితాంతం రుణపడి ఉంటామని తుమ్మల పేర్కొన్నారు. ‘చిమ్మ చీకట్లో, ధైర్యంగా 16 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, జిల్లా ప్రజల తరఫున నా ధన్యవాదాలు’ మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిన్న రాత్రి నుంచి పర్యవేక్షించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులకు తుమ్మల తన అభినందనలు తెలిపారు. ఈ సంఘటనలో చుట్టుపక్క గ్రామాల ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు వారికి, పార్టీ యంత్రాంగానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

Popular Articles