Top 5 This Week

Related Posts

Cyber Crimes: ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెల్యే అనుచరునికి ముగిసిన పోలీస్ కస్టడీ

హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరునిగా ప్రాచుర్యం పొందిన దేవరపల్లి పట్టాభికి శనివారం పోలీస్ కస్టడీ ముగిసింది. సైబర్ నేరాల కేసులో హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ఇటీవల పట్టాభిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గడచిన ఏడు నెలలుగా చిక్కకుండా తప్పించుకున్న పట్టాభి హైదరాబాద్ లో అడుగు పెట్టగానే వలపన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో గల పట్టాభిని కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని మూడు రోజులపాటు విచారించారు.

ఆస్ట్రేలియన్లు టార్గెట్ గా దేవరపల్లి పట్టాభి తన ముఠాతో రూ. 100 కోట్ల వరకు దోపిడీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రిట్జ్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో కాల్ సెంటర్ ముసుగులో ఆస్ట్రేలియా పౌరులను మోసం చేసి, ఆర్థికంగా దోపిడీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇలా దొంగిలించిన డబ్బును నేరుగా తమ ఖాతాల్లోకి మళ్లించకుండా, అస్ట్రేలియాలోనేగల భారతీయ విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

అక్కడి నుంచి హవాలా, క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బును ఇండియాకు రప్పించినట్లు పోలీసులు కనుగొన్నారు. అయితే రూ. 100 కోట్ల దోపిడీ సొమ్మును పట్టాభి ఏ రాజకీయ నాయకుడి వద్ద దాచారనే అంశంపైనా ఖమ్మం జిల్లాలో భిన్న ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేతో పట్టాభికి గల అత్యంత సన్నిహిత సంబంధాలు, అతని ముఖ్య అనుచరునిగా పేరుగాంచడం తదితర అంశాలు ప్రామాణికంగా ఈ చర్చ జరుగుతుండడం గమనార్హం.

Popular Articles