Top 5 This Week

Related Posts

స్ట్రోకు మీద స్ట్రోక్: కొండపల్లి గణేష్ పై మరో కేసు

ఖమ్మం: దాదాపు నాలుగు నెలల క్రితం ఖమ్మం కోర్టులో ‘దివాళా’ పిటిషన్ (ఐపీ) దాఖలు చేసిన లిక్కర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేష్ పై మరో కేసు నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డిని ఆన్ లైన్ లో బెదిరించాడనే అభియోగంపై గణేష్ పై ఖమ్మం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇల్లెందుకు చెందిన కొండపల్లి గణేష్ తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ, తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా దుష్ప్రచారం చేస్తున్నాడని, తద్వారా తన విధులకు ఆటంకం కలిగిస్తున్నాడనే పలు అంశాల సారాంశంతో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఈనెల 11వ తేదీన ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఆయన తన ఫిర్యాదులో ప్రస్తావించారు.

హైదరాబాద్ గచ్చిబౌలిలోని మైహోం భుజాలో నివసించే పలువురి నుంచి వ్యాపారం, లాభాల పేరుతో రూ. 3.45 కోట్ల మేరకు మోసం చేశాడని సిల్వియా శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సైబరాబాద్ EOW పోలీసులు కొండపల్లి గణేష్ పై ఇటీవల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనానంతరం పలు యూ ట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యులూ ఇస్తూ కొండపల్లి గణేష్ ఎక్సైజ్ ఖమ్మం డీసీ సోమిరెడ్డిపై ఆరోపణలు చేశాడు. ఇల్లెందులోని వైన్స్ అంశంలో గణేష్ చేసిన ఆరోపణలను ఎక్సైజ్ డీసీ సోమిరెడ్డి తోసిపుచ్చారు.

తాను ఖమ్మంలో బాధ్యతలు స్వీకరించకముందు జరిగిన పరిణామాలను తనకు అంటగడుతూ గణేష్ ఆరోపణలు చేశాడని, తన అధికారిక వాట్సాప్ నెంబర్ కు సందేశాలు పంపిస్తూ తనను బెదిరిస్తున్నాడని ఎక్సైజ్ శాఖ డీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకున్న అనంతరం ఖమ్మం అర్బన్ పోలీసులు కొండపల్లి గణేష్ పై కేసు నమోదు చేశారు. బీఎస్ఎస్ చట్టంలోని 352, 336 (4) ప్రకారం గణేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ భానుప్రకాష్ ‘సమీక్ష’తో చెప్పారు.

కాగా గణేష్ పై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. లిక్కర్ వ్యాపారంలో పెట్టుబడులు, లాభాల పేరుతో తన నుంచి డబ్బు తీసుకుని మోసగించడంతోపాటు కులం పేరుతో దూషించాడని ఓ గిరిజనుడు ఇచ్చిన ఫిర్యాదుపైనా ఇల్లెందు పోలీసులు కొద్ది నెలల క్రితం గణేష్ పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

తాజాగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ను బెదిరించాడనే అభియోగంపై ఖమ్మం అర్బన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. మొత్తంగా వివిధ అంశాల్లో గణేష్ పై వరుసగా నమోదవుతున్న కేసులు లిక్కర్, రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొండపల్లి గణేష్ పై ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రతిని దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చూడవచ్చు.

Popular Articles