హైదరాబాద్: ప్రైవేట్ భూములను 22ఏ కింద నిషేధిత జాబితాలో పెట్టడంపై తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధిత ప్రజలకు క్షమాపణ చెప్పారు. నిషేధిత జాబితా ‘అప్ డేట్’లో పొరపాటు జరిగిందని, 22ఏ భూములపై తాము మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలకు చెందినఅధికారులతో చర్చించినట్లు చెప్పారు. ఈ అంశంలో ఆయా జిల్లాల నుంచి 750 దరఖాస్తులు వచ్చాయని, ప్రైవేట్ భూములను 22ఏ కింద పెట్టారంటూ దరఖాస్తుదారులు పేర్కొన్నారని మంత్రి చెప్పారు.
సోమవారం మంత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రధానంగా మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి నాలుగు జిల్లాల్లోనే సమస్య ఎక్కువగా ఉందన్నారు. మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లాలో 511 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటితోపాటు మిగిలిన జిల్లాల్లో 22/ఎ దరఖాస్తులన్నింటినీ ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని ఆదేశించామన్నారు. దీనికోసం అవసరమైతే స్లాట్ బుకింగ్‌ల సంఖ్య పెంచాలంటూ సూచించామని చెప్పారు.
నిషేధిత భూములపై సమాచారానికి టోల్‌ఫ్రీ నెంబర్ 1800 5994788 ను ఏర్పాటు చేశామన్నారు. ఎవరు దీనికి సమాచారం పంపినా కనీసం 3 రోజల్లో సమాధానం అందుతుందని, పరిష్కారానికి చర్యలు చేపడతారని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశంలేని కేసుల్లో ఎందుకు చేయలేమో ప్రజలకు స్పష్టమైన కారణం చెప్పాలని, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లయితే నిబంధనల ప్రకారం తిరిగి చెల్లించాలని ఆదేశించామన్నారు.
రాష్ట్రంలోని భూదాన్ భూములు వాటికి సంబంధించిన పెండింగ్ సమస్యలు, వివాదాలు, పరిష్కార మార్గాలపై సమగ్ర నివేదిక రూపొందిస్తామన్నారు.
యుఎల్సి జాబితాను సరిచేస్తున్నామని , అసలైన హక్కుదారులకు న్యాయం చేస్తూ మరో రెండు రోజుల్లో తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామని మంత్రి పొంగులేటి తెలిపారు.
హైదరాబాద్ జిల్లాలో ఒక ఆస్తికి సర్వేశాఖ నుంచి టి ఎస్ ఎల్ ఆర్, సర్వే నెంబర్లు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండింటినీ సూపర్ ఇంపోజ్ చేసే సమయంలో సమస్యలు ఏర్పడ్డాయి వీటిని కూడా పరిష్కరిస్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లాలో 12 ఎకరాలు ఉంటే అందులో రెండు ఎకరాలు భూధాన్ భూములుగా పేర్కొంటూ మొత్తం 12 ఎకరాలను 22ఎలో పెట్టడం జరిగిందన్నారు. ఇలాగే కొన్ని దేవాదాయ , అటవీ భూములు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయని జియో ట్యాగింగ్ ద్వారా అసలు స్ధలాలకు రిజిస్ట్రేషన్ చేసి మిగిలిన భూములను ఫ్రీహోల్డ్ చేయాలంటూ ఆదేశించామన్నారు.
గతంలో హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో అప్పట్లో అధికారులు నిషేధిత భూముల జాబితానుంచి తొలగించిన భూముల వివరాలను వదిలేయడంతో
అవి నేటికీ కొనసాగుతూ నిషేధిత జాబితాలో ఉండిపోయినందున అధికారుల చర్యలతో సామాన్యులు కూడా ఇబ్బంది పడ్డారని, ఇందుకు తాను అధికారుల తరపున క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. అయితే అధికారులపై నెపం నెట్టి తమ ప్రభుత్వం ఈ సమస్యను ప్రజలపై వదిలేయదని, దీనిని పరిష్కరించే బాధ్యత కూడా తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
నిషేధిత భూముల పేరిట అసలైన యజమానులకు ఎటువంటి అన్యాయం జరగదని హామీ ఇస్తున్నానని, ఓ వైపు ప్రభుత్వ భూములను పరిరక్షిస్తూనే భవిష్యత్తులో ఎటువంటి పొరపాట్ల జరగనివ్వబోమన్నారు. సిఎస్-7, సిఎస్ -14కు సంబంధించి కొన్ని దశాబ్దాలుగా కోర్టు కేసుల్లో మగ్గుతున్నాయని, ఒకవైపు కోర్టులో హియరింగ్స్ నడుస్తుండగానే మరోవైపు కొన్ని చోట్ల రెగ్యలరైజేషన్ జరిగిందన్నారు. ఇవన్నింటినీ కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. హైదరాబాద్ లోని ఆల్విన్, ఆజ్బెస్టాస్ కాలనీల్లోని ప్రైవేటు భూములను విభజించి అక్కడ రిజిస్ట్రేషన్లకు ఇబ్బంది లేకుండా చేయాలని ఆదేశించామన్నారు.

