Top 5 This Week

Related Posts

ఆ ఒక్క కాలేజీ తీగ లాగితే 52 సంస్థల ‘ఫోర్జరీ’ డొంక కదిలింది!

హైదరాబాద్: ఓ ఫిర్యాదు.. ఓ కాలేజీ నకిలీ ఫైర్ ఎన్వోసీ సమర్పించిందనేది అందులోని సారాంశం. ఇంకేముంది..? మొత్తం 52 ప్రైవేట్ జూనియర్ కళాశాల ‘ఫోర్జరీ’ బాగోతం బట్టబయలైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎనిమిది ప్రయివేట్ కళాశాలలపై హైదరాబాద్ లేక్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈమేరకు మెహిదీపట్నంలోని ప్రియాంక, విద్యానగర్ లోని మదర్స్ గర్ల్స్, చంద్రాయణగుట్టలోని శ్రీచంద్ర, చిక్కడపల్లిలోని న్యూ ఎరా, శివరాంపల్లిలోని షాహీన్, తెల్లాపూర్ లోని వశిష్ట, బర్కత్ పురాలోని హైందవి, ఎస్ఆర్ నగర్ లోని రెజోనెన్స్ కళాశాలలపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయా కాలేజీలపై బీఎన్ఎస్ చట్టంలోని 337, 336(3), 340(2), 318(4), r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఇంతకీ ప్రయివేట్ కళాశాలల ‘ఫోర్జరీ’ బాగోతం ఎలా వెలుగు చూసిందో ఓసారి పరిశీలిస్తే..

తెలంగాణా కోర్ అర్బన్ రీజియన్ (TCUR) పరిధిలోని GHMC, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధులు కలిగిన ప్రాంతంలోని ‘హై-రైజ్’ భవనాలు కాని వాటికి అగ్నిమాపక శాఖ అనుమతి పత్రాలను (Fire NOCs) జారీ చేసేందుకు తనిఖీ చేసే అధికారం HYDRAAకు ఉంది. ఈమేరకు తెలంగాణ ఫైర్ సర్వీసెస్ యాక్ట్-1999 నిబంధనల మేరకు, తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ, సివిల్ డిఫెన్స్ శాఖ డైరెక్టర్ జనరల్ అప్పగించిన బాధ్యతలకు అనుగుణంగా హైడ్రాకు ఈ అధికారం సంక్రమించింది. ఇందులో భాగంగానే అనేక జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఫైర్ NOCలను పొందడానికి హైడ్రాకు దరఖాస్తులు సమర్పిస్తున్నాయి.

అయితే గత ఫిబ్రవరి 26వ తేదీన హైడ్రా ఆఫీసుకు గొర్లపల్లి సురేష్ అనే వ్యక్తి ఓ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని బర్కత్ పురా ప్రాంతంలో గల హైందవి జూనియర్ కళాశాల అనే విద్యా సంస్థ నకిలీ ఫైర్ ఎన్వోసీలను సమర్పించి, వినియోగిస్తోందనేది ఫిర్యాదులోని అసలు విషయం. దీంతో ఆఫీసులోని రికార్డులను పరిశీలించిన తర్వాత హైందవి కాలేజీ యాజమాన్యం సమర్పించిన ఎన్వోసీ పత్రం నకిలీదిగా హైడ్రా అధికారులు నిర్ధారించారు.

అంతేగాక క్యూర్ పరిధిలోని కొన్ని జూనియర్ కాలేజీలు అకడమిక్ అనుబంధ గుర్తింపు, నిర్వహణ అనుమతుల కోసం నకిలీ, ఫోర్జరీ ఫైర్ ఎన్వోసీ పత్రాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు సమర్పించినట్లు కూడా హైడ్రా అధికారుల దృష్టికి వచ్చింది. ఫోర్జరీ ద్వారా సృష్టించిన ఆయా నకిలీ పత్రాలను హైడ్రా, జీహెచ్ఎంసీ వ్యవస్థలు జారీ చేసినట్లు జూనియర్ కళాశాల యాజమాన్యాలు పేర్కొన్నాయి.

దీంతో జూనియర్ కళాశాలల యాజమాన్యాలు 2025-26, 2026-27 సంవత్సరాలకు సమర్పించిన ఫైర్ ఎన్వోసీ పత్రాల ప్రామాణికతను పరిశీలించేందుకు, వాటి కాపీలను తమ ఆఫీసుకు పంపాలని హైడ్రా కమిషనర్ కార్యాలయం గతనెల 29వ తేదీన తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శికి ఓ లేఖ రాసింది. హైడ్రా ఆఫీసు అభ్యర్థన మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల ఇంటర్ బోర్డు అధికారులు వివిధ జూనియర్ కళావాలలు సమర్పించిన మొత్తం 76 ఎన్వోసీ పత్రాలను పరిశీలన కోసం పంపారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన హైడ్రా అధికారులు అందులో ఎనిమిది కళాశాలలు సమర్పించిన ఫైర్ ఎన్వోసీలు నకిలీవిగా, తప్పులు పత్రాలుగా నిర్ధారించారు. ఇదే అంశాన్ని సంబంధిత జిల్లా అధికారులకు లేఖ ద్వారా తెలిపారు.

అంతేకాదు ఫోర్జరీ సంతకాలతో నకిలీ ఎన్వోసీ పత్రాలను సమర్పించిన మెహిదీపట్నంలోని ప్రియాంక, విద్యానగర్ లోని మదర్స్ గర్ల్స్, చంద్రాయణగుట్టలోని శ్రీచంద్ర, చిక్కడపల్లిలోని న్యూ ఎరా, శివరాంపల్లిలోని షాహీన్, తెల్లాపూర్ లోని వశిష్ట, బర్కత్ పురాలోని హైందవి, ఎస్ఆర్ నగర్ లోని రెజోనెన్స్ కళాశాలల అనుమతిని, గుర్తింపును రద్దు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ రికార్డులను ఫోర్జరీ చేయడం, ప్రజల భద్రతకు ముప్పు కలిగించడం వంటి తీవ్ర నేర స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయా ఎనిమిది జూనియర్ కళాశాల యాజమాన్యాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదుదారు పోలీసులను అభ్యర్థించారు. ఈ నకిలీ ధృవీకరణ పత్రాల తయారీ, కల్పన, పంపిణీలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు సమగ్ర దర్యాప్తు చేయాలని కూడా కోరారు. ఈ నేపథ్యంలోనే లేక్ పోలీసులు ఎనిమిది కళాశాలల యాజమాన్యాలపై కేసు నమోదు చేశారు.

అయితే తాజా సమాచారం ప్రకారం మొత్తం 142 కళాశాలల ఎన్వోసీలను పరిశీలించగా, అందులో 52 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు సమర్పించిన పత్రాలు ‘ఫోర్జరీ’గా హైడ్రా అధికారుల పరిశీలనలో తేలినట్లు తెలుస్తోంది. ఇదీ క్యూర్ పరిధిలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాల ‘ఫోర్జరీ’ బాగోతం. విద్యాబుద్ధులు నేర్పాల్సిన యాజమాన్యాలే ఇటువంటి ఫోర్జరీ వ్యవహారానికి పాల్పడితే అందులో బోధించే పాఠాలు విద్యార్థులకు ఎటువంటి సందేశాన్ని ఇస్తాయనేది ప్రజల్లో కలుగుతున్న అసలు సందేహం.

Popular Articles