గుంటూరు: గుంటూరు నగరంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రతిఘటన సినిమాలో హీరోయిన్ విజయశాంతిని విలన్ చరణ్ రాజ్ నడిరోడ్డుపై వివస్త్రను చేసే దృశ్యాన్ని తలపించే విధంగా చోటు చేసుకున్న అమానుష ఘటన ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర కలకలం సృష్టించింది. సభ్య సమాజం తల దించుకునేలా ఓ మహిళను వివస్త్రను చేయడమేగాక, చితకబాది, పది నిమిషాలపాటు నగ్నంగా ఆమెను నడిరోడ్డుపై ఉంచి పైశాచిక చర్యకు పాల్పడిన అనాగరిక ఘటన రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఉదంతంలో బాధితురాలి ఫిర్యాదును స్వీకరించే అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే అభియోగంపై గుంటూరు జిల్లా ఎస్పీ ఆగ్రహించారు. ఫలితంగా సంబంధిత స్టేషన్ సీఐపై శాఖాపరమైన చర్యలకు ఆయన ఆదేశించారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత వేర్వేరుగా స్పందించారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతపు పూర్తి వివరాల్లోకి వెడితే.. గుంటూరు నగరంలోని పశ్చిమ నియోజకవర్గం నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని 21వ డివిజన్‌లోని కృష్ణబాబు కాలనీకి చెందిన ఓ గృహిణి తన ఇంటికి తాగునీటి పైప్‌లైన్‌కు పదిహేనేళ్ల క్రితం మోటరును ఏర్పాటు చేసుకున్నారు. ఈ పైప్ లైన్ చాలా కాలంగా ఉన్నప్పటికి, ఇటీవలే ఆ ప్రాంతంలో సిమెంట్ రోడ్డు నిర్మించారు. అయితే అదే ప్రాంతానికి తెలుగు దేశం పార్టీ 21వ డివిజన్ కార్యదర్శి మల్లెల మూర్తి సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయినందున, పైప్‌లైన్‌కు మోటరును తొలిగించాల్సిందిగా ఇటీవల నగరపాలక సంస్థలో ఫిర్యాదు చేశాడు.

ఈ నేపథ్యంలో సీసీ రోడ్డు నిర్మాణం చేసినప్పటికీ, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదని సదరు గృహిణి మల్లెల మూర్తికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా గత బుధవారం సాయంత్రం మల్లెల మూర్తికి, ఈ గృహిణికి మధ్య తీవ్ర వాగ్వావాదం చోటు చేసుకుంది. అనంతరం జరిగిన ఘటనపై గృహిణి నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో తెలుగు దేశం పార్టీ నాయకుడు మల్లెల మూర్తి వ్యవహరంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్ళింది. అయితే పోలీసులు బందోబస్తులో ఉన్నామని చెప్పి వెళ్ళడంతో కొద్దిసేపటి తరువాత బాధితురాలు, కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి ఇంటికి చేరుకుంది.
తనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గృహిణి వెళ్లారనే విషయం తెలుసుకున్న మల్లెల మూర్తి అదే రోజు రాత్రి తనకు చెల్లి వరుసయ్యే ట్రాన్స్ జెండర్ మాధవి సహా అతని కుటుంబ సభ్యులు ముక్కుముడిగా గృహిణి వద్దకు వెళ్లారు. ఆమెను తీవ్రంగా కాళ్ళతో తన్నుతూ, కొట్టుకుంటూ అడ్డు వచ్చిన గృహిణి కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడికి దిగారు. అక్కడితో వదలకుండా గృహిణిని తీవ్రంగా కొట్టి నడి రోడ్డుపై ఆమెను వివస్త్రను చేసి, ఆ ప్రాంత వాసులందరి ముందు ఆమెను నగ్నంగానే నడిరోడ్డు పై పది నిమిషాలకు పైగా కూర్చోపెట్టారు. అంతేగాక మూత్రం పోయించి మరీ అమానుష చర్యకు పాల్పడ్డారు. తనకు జరిగిన అమానుష అవమానపు ఘటనపై బాధిత గృహిణి నగరపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇందుకు బాధ్యులుగా తొమ్మిది మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి, వారికోసం గాలిస్తున్నారు.

సీరియస్ గా తీసుకోండి: పోలీసులకు చంద్రబాబు ఆదేశం
ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించాలని, సమాజంలో ఏ ఒక్క మహిళకు అవమానం జరిగినా ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఇటువంటి ఘటనలకు తావులేదని, ఇందుకు దారి తీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ అంశంలో ఇప్పటికే కేసు నమోదైందని, నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారని కూడా చంద్రబాబు ప్రకటించారు. ఘటనతో సంబంధం గల మల్లెల మూర్తిని తక్షణమే పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

హోం మంత్రి రియాక్షన్:
గుంటూరులో మహిళపై జరిగిన అమానుష దాడి ఘటనపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ హోంమంత్రికి నివేదించారు. కేసు విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపైనా చర్యలకు అనిత ఆదేశించారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఎంతటివారైనా ఉపేక్షించవద్దని ఆమె పోలీసులకు స్పష్టం చేశారు. పార్టీల ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అనిత ఆదేశించారు. కాగా మహిళపై దాడి ఘటనలో నిర్లక్ష్యం వహించిన నగరంపాలెం సీఐ సత్యనారాయణపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రకటించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై సకాలంలో స్పందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు చెప్పారు.

వైఎస్ఆర్ సీపీ నాయకుల పరామర్శ:
గుంటూరు నగరంలో మహిళపై జరిగిన దాడి ఉదంతం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినట్లు వైఎస్ఆర్ సీపీ నాయకులు చెప్పారు. బాధితురాలి కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి షేక్ నూరీ ఫాతిమా, గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, అప్పిరెడ్డి తదితరులు పరామర్శించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని, వారికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని వారు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

