ఎటపాక: ఏపీలోని పోలవరం జిల్లా ఎటపాక వద్ద గల గోదావరి నదిలో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన గిరిజనులు ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యారు. వీరికోసం గాలింపు చర్యలు చేపట్టగా ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. భద్రాచలం పట్టణ సమీపంలో గల ఏపీలోని ఎటపాక మండలం గొమ్ము కొత్తగూడెం వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది.

మృతులను గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఊకె సుశీల (37), ఊకె లక్ష్మి (37), తుర్రం భారతి (40), భాసుబోయిన బాలరాజు (38), ఊకె రమేష్ (38)లుగా గుర్తించారు. చేపల వేట కోసం గోదావరిలోకి దిగిన క్రమంలో లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో వీరంతా గల్లంతయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. విస్తృతంగా సాగిన గాలింపు చర్యల అనంతరం ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

