కరీంనగర్: కరీంనగర్ లోని పీఎంజే జువెల్లరీ షాపులో దుండగుల కాల్పులు, భారీ చోరీ ఘటనపై పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కీలకాంశాలను వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన ఆదివారం స్థానిక మీడియాతో మాట్లాడారు.
పీఎంజే షాపులోకి మొత్తం ఐదుగురు వ్యక్తులు తుపాకులతో వచ్చినట్లు సీపీ ప్రకటించారు. అంతకు ముందు ఓ వ్యక్తి వచ్చి జువెల్లరీ గురించి ఎంక్వయిరీ చేశాడని, ఆ తర్వాత నగల షాపులోకి నలుగురు వ్యక్తులు ప్రవేశించినట్లు చెప్పారు. నగల షాపు సెక్యూరిటీ గార్డుకు గన్ పెట్టి దోపిడీని ప్రారంభించారని, అయితే షాపులోని పరిస్థితి, ఒత్తిడి పెరగడంతో దుండగులు భయంతో కాల్పులు జరిపారని చెప్పారు.
దుండగుల వద్ద మొత్తం ఐదు తుపాకులు ఉన్నాయని, కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో ఓ మ్యాగ్జిన్, నాలుగు కాట్రేజ్ లు లభ్యమైనట్లు సీపీ చెప్పారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన నలుగురు బాధితులు కూడా సురక్షితంగా ఉన్నారని, ఎటువంటి ప్రాణాపాయం లేదని, ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. కాల్పుల ఉదంతంపై నగల షాపులోని మిగతా వ్యక్తుల స్టేట్మెంట్లను రికార్డు చేశామని, సీసీ టీవీ ఫుటేజీ ద్వారా దర్యాప్తు ప్రారంభించామన్నారు.
నగల షాపులో దుండగులు ఉదయం 11.11 గంటలకు కాల్పులు జరిపారని, 11.20 గంటలకు తమ పోలీస్ టీంలు చేరుకున్నట్లు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షాపులో కిలో బంగారం దోపిడీకి గురైందని, మేనేజర్ పూర్తి వివరాలను సేకరిస్తున్నారని, లెక్క తేలాక దుండగులు దోచుకున్న బంగారం ఎంత అనేది స్పష్టంగా తెలుస్తుందన్నారు. దుండగులు తెలుగు, హిందీ భాషల్లో మాట్లాడారని, రెక్కీ చేశారా? లేదా అనేది పరిశీలించాల్సి ఉందన్నారు. తాము నిన్న జనరల్ నాకా బందీ నిర్వహించామని సీపీ గౌస్ ఆలం ఈ సందర్భంగా ప్రకటించారు. జిల్లాలోని 34 జంక్షన్లలో మూడు గంటలపాటు నాకాబందీ నిర్వహించామన్నారు.

