హైదరాబాద్: తీవ్ర కలకలం రేపిన ఆరుగురి హత్యోదంతం తెలంగాణా పోలీసు శాఖను కుదిపేసింది. ఈ ఘటనలో ఓ ఎస్ఐ సస్పెన్షన్ కు గురికాగా, హత్యలకు పాల్పడిన నిందితున్ని పట్టిస్తే రూ. 2.00 లక్షల నగదు బహుమతి ఇస్తామని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దైవాలగూడలో శనివారం తెల్లవారుజామున ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. దైవాలగూడకు చెందిన పార్వతి రాజ్ కుమార్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను, ఇద్దరు కుమారులు సహా మొత్తం ఆరుగురిని దారుణంగా కత్తితో నరికి చంపాడు. రాజ్ కుమార్ తొలుత 17 ఏళ్ల బాలిక ఇంట్లోకి ప్రవేశించి ఆమెను లాక్కెడుతుండగా, బాలిక తల్లి, నాయినమ్మ అతన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో రాజ్ కుమార్ వారిద్దరినీ కత్తితో పొడిచి చంపాడు.

ఆ తర్వాత బాలికను దైవాలగూడలోని చెరువు వద్దకు తీసుకువెళ్లి పీకకోసి చంపాడు. అనంతరం అదే గ్రామంలోని తన ఇంటికి చేరుకున్న రాజ్ కుమార్ కట్టుకున్న భార్య సరిత (33)ను, తన ఇద్దరు కుమారులైన పరీక్షిత్(4), దైవీక్షిత్ (2)లను కత్తితో పీకలు కోసి ప్రాణాలు తీశాడు. ఈ విధంగా ఆరుగురిని హత్య చేసిన రాజ్ కుమార్ ను తమకు అప్పగించాలని, కఠినంగా శిక్షించాలంటూ షాబాద్ రోడ్డుపై గ్రామస్తులు బైఠాయించడంతో తీవ్ర ఉద్రికత్త ఏర్పడింది.
అయితే బాలిక కుటుంబాన్ని వేధించిన కేసులో రాజ్ కుమార్ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంలో పోలీసులపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పటికే నమోదైన కేసులో రాజ్ కుమార్ ను అరెస్ట్ చేయడంలో పోలీసులు పెద్దగా పట్టించుకోలేదనేది ఆయా ఆరోపణల సారాంశం. గత రాత్రి 11 గంటల ప్రాంతంలో బాలికను రాజ్ కుమార్ బయటకు లాక్కెడుతున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. కాగా ఈ ఘటనలో షాబాద్ ఎస్ఐ రమేష్ పై సస్పెన్షన్ వేటు వేసినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ప్రకటించడం గమనార్హం.

కాగా ఆరుగురిని దారుణంగా హత్య చేసిన రాజ్ కుమార్ పట్టుకునే అంశంలో పోలీస్ శాఖ భారీ మొత్తపు నగదు నజరానాను ప్రకటించింది. అతన్ని పట్టుకునేందుకు విశ్వసనీయ సమాచారం అందించిన వారికి రూ. 2.00 లక్షల నగదు బహుమతి అందించనున్నట్లు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ప్రకటించారు. సమాచారం అందించిన వ్యక్తి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు, వారి భద్రతకు పూర్తి హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు రాజ్ కుమార్ గురించి ఏవేని వివరాలు తెలిసిన వారు చేవెళ్ల పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెం. 8712665324 కు ఫోన్ కాల్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించి, సమాచారం అందించవచ్చని ఆయన పేర్కొన్నారు.

