భద్రాచలం: మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధక చర్యల్లో భాగంగా తెలంగాణా ‘ఈగిల్ ఫోర్స్’ కు చెందిన ఖమ్మం రీజినల్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్(RNCC), భద్రాద్రి జిల్లా పోలీసులు మంగళవారం నిర్వహించిన కీలకమైన జాయింట్ ఆపరేషన్ లో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో రూ. 2.62 కోట్ల విలువైన 525 కిలోల గంజాయిని పట్టుకుని, ఒక కంటైనర్ లారీ, ఎస్కార్ట్ వాహనంగా వినియోగించిన బజాజ్ పల్సర్ బైక్, ఐదు సెల్ ఫోన్లను, రూ. 10,570 మొత్తపు నగదును స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం సమీపంలోని ఐటీసీ పేపర్ బోర్డ్ కంపెనీ వెస్ట్ గేట్ వద్ద ఆయా విభాగాల పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.
‘ఈగిల్ ఫోర్స్’ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు సహదేవ్ హంతల్ ఒడిషాలోని అల్లూరికోట అటవీ ప్రాంతం నుంచి ఈ భారీ మొత్తపు గంజాయిని సేకరించాడు. అక్కడి నుంచి ఏపీలోని మోతుగూడెం-తులసిపాక వరకు గంజాయి బస్తాలను తరలించడానికి కొందరు కూలీలను నియమించుకున్నాడు. ఆ తర్వాత తరలించిన గంజాయిని మహ్మద్ సైఫ్, ఫిరోజ్ భాయ్ లకు చెందిన కంటైనర్ లారీలో లోడ్ చేశారు. గంజాయి బస్తాలు పోలీసులకు కనిపించకుండా దాచడానికి కంటైనర్లో ప్రత్యేకంగా ఓ ఛాంబర్ ను తయారు చేయించుకోవడం గమనార్హం.

కంటైనర్ లోని ప్రత్యేక ఛాంబర్ లో దాచిన గంజాయి బస్తాలను తులసిపాక నుంచి భద్రాచలం, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్రకు, అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ కు తరలించడానికి బయలుదేరారు. అయితే ఆయా ముఠా గంజాయిని పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఖచ్చితమైన సమాచారం అందుకున్న ఈగిల్ ఫోర్స్, భద్రాద్రి జిల్లా పోలీసులు తులసిపాక నుంచి బయలుదేరిన కంటైనర్ ను, దానికి ఎస్కార్టుగా ముందున్న బైక్ కదలికలను నిరంతరం పర్యవేక్షించారు.
ఈ విషయం గ్రహించని గంజాయి అక్రమ రవాణా ముఠాకు చెందిన కంటైనర్ సారపాకలోని ఐటీసీ పేపర్ బోర్ట్స్ సంస్థకు చెందిన వెస్ట్ గేట్ వద్దకు రాగానే ఈగిల్ ఫోర్స్, భద్రాద్రి జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. రూ. 2.62 కోట్ల విలువైన 525 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఒడిషాలోని మల్కనగిరికి చెందిన సహదేవ్ హంతల్ (20), అల్లూరి జిల్లా సోమిరెడ్డి పాలేనికి చెందిన డోగ్రి త్రినాథ్ (38),ఉత్తరప్రదేశ్ లోని బీజాపూర్ కు చెందిన కులదీప్ శర్మ (27)లతోపాటు మరో బాలున్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయి అక్రమ రవాణా కేసులో మిగతా నిందితులైన మహ్మద్ సైఫ్, ఫిరోజ్ భాయ్, రాజా మిశ్రా, మహ్మద్ ఇమ్రాన్ పరారీలో ఉన్నట్లు ఈగిల్ పోర్స్ ప్రకటించింది.

కాగా ఇటీవలి కాలంలో చాలా మంది యువకులు, విద్యార్థులు మాదకద్రవ్యాలకు (డ్రగ్స్) బానిసలవ్వడం, నేరాలు చేయడం, ఇతర సామాజిక వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని ఈగిల్ ఫోర్స్ ఈసందర్బంగా పేర్కొంది. ఈ దుష్ప్రభావం వల్ల అనేక కుటుంబాలు బాధితులుగా మారాయని, మాదకద్రవ్యాల బారిన పడవద్దని యువతకు, విద్యార్థులకు విజ్ఞప్తి చేసింది. అలాగే తమ పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని తల్లిదండ్రులకు ‘ఈగల్ ఫోర్స్’ సూచించింది.

