Top 5 This Week

Related Posts

‘మట్టి’కి రూ. 2.00 లక్షల లంచం, ఇరిగేషన్ ఇంజనీర్ అరెస్ట్

అశ్వారావుపేట: ఓ రైతు నుంచి రూ. 2.00 లక్షల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తూ ఇరిగేషన్ శాఖకు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) ఎల్. శ్రీనివాస్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. అశ్వారావుపేట మండలంలోని దొంతికుంట చెరువు నుంచి శిఖం భూమిలో మట్టి తోలుకునేందుకు అనుమతి కోసం ఓ రైతు ఇరిగేషన్ విభాగానికి చెందిన ఏఈఈ శ్రీనివాస్ ను సంప్రదించారు. ఇందుకు రైతు నుంచి ఆయా ఇంజనీర్ రూ. 4.00 లక్షల మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేశాడు. అయితే ఇంజనీర్ కు లంచం ఇవ్వడం ఇష్టం లేని రైతు ఏసీబీ అధికారులను సంప్రదించారు.

ఈమేరకు వలపన్నిన ఏసీబీ అధికారులకు ఏఈఈ శ్రీనివాస్ రూ. 2.00 లక్షల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. తన కార్యాలయంలోనే శ్రీనివాస్ రైతు నుంచి లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏఈఈ శ్రీనివాస్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి, కోర్టుకు హాజరుపర్చనున్నట్లు సమాచారం. కాగా ఇదే రైతు గతంలోనూ విద్యుత్ శాఖకు చెందిన ఓ అసిస్టెంట్ ఇంజనీర్ ను ఏసీబీకి పట్టించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరిగేషన్ శాఖలో కలకలం రేపింది.

Popular Articles