కొడంగల్: టీచర్ల పీఆర్సీ, ఇంక్రిమెంట్ల అంశంలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే రెండేళ్లపాటు తనకు సహకరించి వెసులుబాటు కల్పిస్తే, పీఆర్సీ, ఇంక్రిమెంట్ల వంటి టీచర్ల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. నిరుపేదల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి విద్యారంగంలో సంస్కరణలు చేపట్టిన ఈ దశలో తెలంగాణ విద్యా వ్యవస్థను భారతదేశానికి ఒక దిక్సూచిలా నిలబెట్టడానికి టీచర్లందరూ సహకరించాలని కోరారు. కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, “ఆర్థిక వెసులుబాటును బట్టి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. మిగతా శాఖలతో పోలిస్తే విద్యాశాఖ ఆదర్శంగా నిలబడాలి. పిల్లల భవిష్యత్తుకు మార్గదర్శకులు మీరే. రెండేండ్లు సమయం ఇవ్వండి. రాష్ట్రంలోని ప్రతి ఉపాధ్యాయుడికి విజ్ఞప్తి చేస్తున్నా. రెండేండ్లలో సమస్యలన్నింటినీ సామరస్యంగా మీరు అడక్కుండానే పరిష్కరించే బాధ్యత నాది” అని స్పష్టం చేశారు.
‘ప్రభుత్వ సర్వీసులో మీరు 30 ఏళ్లకు పైగా సేవలందిస్తారు. రాజకీయ నాయకులం ప్రతి ఐదేళ్లకోసారి మీముందుకొచ్చి పరీక్షలు రాయాల్సిందే. నేను చెప్పిన ప్రకారం చేయకుండా ఉంటే.. నిర్ణయం తీసుకోవలసింది మీరే. అందుకు మార్కులు వేయాల్సిందీ మీరే. మీ చేతిలోనే కలం ఉంది. మీ చేతిలోనే బలం ఉంది. టీచర్లే వీధుల్లోకి వస్తే ప్రభుత్వానికి, రాష్ట్రానికి శుభ సూచకం కాదు. మిగతా శాఖలు వేరు. పిల్లల భవిష్యత్తుకు నిర్దేశకులు మీరు. మీరే ధర్నాలు చేస్తానంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నా. రెండేళ్లు సమయం ఇవ్వండి’ అని సీఎం అభ్యర్థించారు.
‘టీచర్లకు, లెక్చరర్లకు అణాపైసా కష్టం రానివ్వను. పీఆర్సీ, ఇంక్రిమెంట్లతో పాటు మిగతా సమస్యలు వేటిలోనూ చిన్న కష్టం రానివ్వను. సలహాదారు కేశవరావుతో కూర్చొని మాట్లాడండి. నన్ను విశ్వసించి సహకరించండి” అని రేవంత్ కోరారు. అలాగే లెక్చరర్లకు సర్వీసు నిబంధనల విషయంలోనూ ఎలాంటి ఢోకా ఉండదు. సర్వీస్ రూల్స్ వేరు, విద్యా విధానం వేరు. ఈ విషయంలో ఇంకా అనుమానాలు ఉంటే సలహాదారు కేశవరావుతో కూర్చొని మాట్లాడండి. ప్రభుత్వం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. జీతభత్యాలు, పీఆర్సీ, ఇంక్రిమెంట్లు నష్టం కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిది” అని సీఎం అన్నారు.

