ఖమ్మం: నకిలీ విత్తనాల కట్టడిపై ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులకు, సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలం ప్రారంభమైన పరిస్థితుల్లో రైతులు పంట సేద్యం కోసం విత్తనాలను కొనుగోలు చేస్తున్నారని, ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసే రైతన్నలు నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంలో రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు సంయుక్తంగా నకిలీ విత్తనాలను కట్టడి చేయాలన్నారు. ఖమ్మం రూరల్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో మంగళవారం నేర సమీక్షా సమావేశాన్ని ఆయన తన కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్బంగా సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ, పొరుగున గల ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా సరిహద్దుల నుండి ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించేలా విజిబుల్ పోలీసింగ్ ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. చెక్ పోస్టుల ద్వారా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను జప్తు చేయాలన్నారు.

అదేవిధంగా మారుతున్న పరిస్థితులు, కొత్త సవాళ్లకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన పోలీసింగ్ పై దృష్టి సారించాలన్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ చేయాలని, నేరాల నియంత్రణలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండాలన్నారు. విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంపొందించాలన్నారు. నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన, వంటి ప్రతికూల ధోరణులకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు.
యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తు పదార్థాలను అడ్డుకునేందుకు, సైబర్ నేరాలను అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తించాలని, తద్వారా ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సీపీ సునీల్ దత్ సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

