ఖమ్మం: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం అలుముకుంది. ఖమ్మం నగరానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పీసీసీ సభ్యుడు మహ్మద్ జావీద్ సూర్యాపేట జిల్లా మోతె సమీపాన బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. తన కారులో సెల్ఫ్ డ్రైవింగ్ ద్వారా ప్రయాణిస్తూ జావీద్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. కారు డివైడర్ ను ఢీకొనగా జావీద్ 15 అడుగుల ఎత్తులో ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేసిన జావీద్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం తీవ్రంగా శ్రమించారు.

మంత్రి పొంగులేటి దిగ్భ్రాంతి:
జావీద్ దుర్మరణం పట్ల తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. జావీద్ మరణించారన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి పేర్కొన్నారు. ఖమ్మం రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జావీద్ పార్టీ కోసం నిరంతరం అంకితభావంతో పనిచేశారని మంత్రి కొనియాడారు.

ప్రజా సమస్యలపై స్పందించే గుణం, పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే నేర్పు కలిగిన నాయకుడు జావీద్ అని ఆయన గుర్తు చేసుకున్నారు. జావీద్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జావీద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ, మంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

మంత్రి తుమ్మల దిగ్భ్రాంతి:
మహ్మద్ జావీద్ అకాల మరణం చెందిన విషాదకర సంఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే మంత్రి సూర్యాపేట పోలీసు అధికారులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. జావీద్ మృతి పార్టీకి, ఖమ్మం నగరానికి తీరని లోటని మంత్రి పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

జావీద్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది: భట్టి
మహమ్మద్ జావీద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలపాటు పార్టీ కష్టకాలంలో ముందుండి జావీద్ సేవలు అందించారని ఆయన గుర్తు చేశారు. ఖమ్మం నగర కార్పొరేషన్ మాజీ అధ్యక్షునిగా, ప్రస్తుతం పీసీసీ కార్యవర్గ సభ్యునిగా, రాజీవ్ గాంధీ పంచాయతీ అభియాన్ కమిటీలో కీలక నేతగా, సేవాదళ్ రాష్ట్ర నాయకునిగా సుదీర్ఘకాలం పార్టీకి ఆయన అందించిన సేవలు మరువలేనివని అన్నారు. మహమ్మద్ జావీద్ కుటుంబానికి యావత్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. జావీద్ కుటుంబానికి ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. జావీద్ ఆత్మకు శాంతి కలగాలని ఆయన ప్రార్థించారు.

జావీద్ మృతి పట్ల ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దిగ్భ్రాంతి:
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ జావీద్ మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసి, పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలందించిన జావీద్ మరణం కాంగ్రెస్ పార్టీకే కాకుండా బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు తీరనిలోటని ఆయన పేర్కొన్నారు. శోక సంద్రంలో ఉన్న జావీద్ కుటుంబ సభ్యులకు ఎంపీ రవిచంద్ర ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

