Top 5 This Week

Related Posts

ఒంటి కన్నుతో ఎంతో చేశా.. ఆరు కళ్లతో మీరేం చేశారు?: పువ్వాడ

ఖమ్మం: ఒంటి కన్నుతో తాను జిల్లాలో అనేక అభివృద్ధి పనులు చేశానని, రెండు చొప్పున ఆరు కండ్లు గల జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఏం చేశారని బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం చింతకాని మండలం జగన్నాధపురంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సబలో సీఎం రేవంత్ రెడ్డి తనను ఒంటికన్ను శివరాసన్ గా బాడీ షేమింగ్ చేయడంపై అజయ్ శనివారం స్పందించారు. ఈమేరకు ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననమే ఎజెండాగా సీఎం రేవంత్ జగన్నాథపురం సభలో మాట్లాడారని అజయ్ అన్నారు. ఓ రోడ్డు ప్రమాదంలో జరిగిన దుర్ఘటన ఘటనలో తాను ఓ కన్ను కోల్పోయినట్లు చెప్పారు. గతంలోనూ సీఎం రేవంత్ ఇలాగే కించపరిచారని, హమీలను నెరవేర్చేందుకు మీకు ఏ అంగ వైకల్యం అడ్డు వచ్చిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, తనకు గల ఒక్క కన్ను తోనే ఎంత గొప్పగా పని చేశానో, ఎంత అభివృద్ధి చేశానో ప్రజలకు తెలుసని, మంత్రిగా తాను ఒక్క కంటితో చేసిన పని ఇప్పుడు ఉన్న ముగ్గురు మంత్రులు ఆరు కళ్లతో ఏం చేశారని ప్రశ్నించారు.

తన మీద సీఎం, మంత్రులకు ఉన్న కక్ష తీర్చుకుంటారని, విషయ పరిజ్ఞానం లేక ముఖ్యమంత్రి స్థాయిని మరిచి కన్ను లేదని, పన్ను లేదని దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. సీతారామ ప్రాజెక్టు కోసం కృషి చేశానని, వ్యక్తిగత విమర్శలతో తాత్కాలికంగా సంతృప్తి పడతారే తప్ప ఎల్లకాలం ఉండదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయక డొంకతిరుగుడు మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని, దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారన్నారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Popular Articles