Top 5 This Week

Related Posts

‘అర్బన్ నక్సల్స్’ అర్థమిదేనా? ఇక ‘లీగల్ పార్టీ’లపై గురి!?

(సమీక్ష ప్రత్యేక కథనం)
ఆపరేషన్ కగార్ ద్వారా తన లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మావోయిస్ట్ పార్టీ దాదాపుగా అంతరించినట్లుగానే వెల్లడించింది. తాము చేపట్టిన ‘కగార్’ ఆపరేషన్ పరిణామాలు, నక్సల్స్ చేతుల్లో చనిపోయిన పోలీసుల సంఖ్యను, ఎన్కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల అంకెను, ప్రభుత్వానికి లొంగిపోయిన నక్సలైట్ల మొత్తాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవలే వివరించారు. నక్సల్స్ రహిత భారత్ గా ఆయన స్వయంగా పార్లమెంటులోనే ప్రకటించారు. What Next?.. ఇదీ ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ఇప్పుడు అర్బన్ నక్సల్స్ వంతు వచ్చినట్లేనా? ఇక అర్బన్ నక్సల్స్ పని పడతామని కేంద్ర పాలకులతోపాటు బీజేపీ నాయకులు కూడా ఇటీవలి కాలంలో పదే పదే పేర్కొంటున్నారు. ఇంతకీ అర్బన్ నక్సల్స్ అంటే ఎవరు? ఈ ప్రశ్న ప్రామాణికంగా, ప్రాతిపదికగా భిన్న చర్చలు జరుగుతున్నయి. ఈ నేపథ్యంలోనే సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నోటీసు జారీ చేసింది. దేశద్రోహం, ఉపా చట్టాల కింద వివిధ సెక్షన్ల ద్వారా నమోదైన కేసులో ఈనెల 22వ తేదీన విచారణకు రావాలని ఎన్ఐఏ ఆయనను కోరింది. గత సెప్టెంబర్ లో ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్ట్ అగ్ర నేత కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా గాదె ఇన్నయ్య కేంద్ర హోం మంత్రిని ఉద్ధేశించి చేసిన ప్రసంగం ఓ యూ ట్యూబ్ ఛానల్ లో ప్రసారమైంది. ఆ ప్రసంగపు వీడియోలోని అంశాలపైనే ఎన్ఐఏ గాదె ఇన్నయ్యపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

గాదె ఇన్నయ్య

ఈ కేసులోనే పలు ప్రజా సంఘాలకు చెందినవారికి, ఇతర విప్లవ పార్టీల నాయకులకు తాజాగా ఎన్ఐఏ నోటీసులు జారీ చేస్తుండడం గమనార్హం. ముఖ్యంగా తెలంగణాలోని ప్రజా సంఘాల, పౌరహక్కుల నాయకులకు, కవులకు, కళాకారులకు, రచయితలకు, సామాజిక కార్యకర్తలకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. నందిని సిధారెడ్డి, గడ్డం లక్ష్మణ్, దేవీ ప్రసాద్, తదితరులకు నోటీసులు జారీ చేసినట్లు తాజా వార్తల సారాంశం. వీరిలో కొందరిని ఇప్పటికే విచారించగా, మరికొందరిని విచారణ చేస్తున్నారు.

ఇదే దశలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు కూడా ఎన్ఐఏ నోటీసు జారీ చేసింది. దేశద్రోహం, ఉపా చట్టాల కింద జారీ అయిన ఈ నోటీసు ఇప్పుడు తాజాగా మరో కోణంలో చర్చనీయాంశంగా మారింది. మావోయిస్ట్ పార్టీని దాదాపుగా అంతం చేసినట్లు ప్రకటించిన కేంద్రం ఈ చర్య ద్వారా ‘లీగల్ పార్టీ’లుగా ప్రాచుర్యం పొందిన విప్లవ సంస్థలపైనా దృష్టి కేంద్రీకరించిందా? అనే ప్రశ్న ప్రామాణికంగా ఈ చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తరహా లీగల్ విప్లవ పార్టీలకు కొదువేమీ లేదనే చెప్పాలి. అప్పటి పీపుల్స్ వార్ సహా అనేక విప్లవ సంస్థలకు ఉమ్మడి రాష్ట్రం నెలవైంది. ప్రస్తుత తెలంగాణాలో ఇంకా పలు లీగల్ విప్లవ సంస్థలు మనుగడ సాగిస్తున్నాయి.

పోటు రంగారావు

నిషేధిత మావోయిస్ట్ పార్టీ మినహా, మిగతా నక్సల్ గ్రూపులను లీగల్ పార్టీలుగానే వ్యవహరిస్తుంటారు. వాటి అనుబంధ ప్రజా సంఘాలు ప్రజల్లోనే పనిచేస్తుంటాయి. వీటీలో జనశక్తి, ప్రతిఘటన, ప్రజాప్రతిఘటన, జనరక్షణ సమితి, సీపీయూఎస్ఐ, న్యూడెమోక్రసీ, ప్రజాపంథా తదితర గ్రూపులు ఉన్నాయి. ఆయా గ్రూపులకు చెందిన ముఖ్యనేతలు మధుసూదన్ రాజ్ యాదవ్, మారోజు వీరన్న, సత్తెన్న, చలమన్న, జగ్గాని భిక్షపతి వంటి ముఖ్య నాయకులు ఎన్కౌంటర్లలో చనిపోయాక లీగల్ పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగానే మారింది. ప్రస్తుతం మాస్ లైన్, న్యూడెమోక్రసీ పార్టీలు మాత్రమే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

ఒకప్పుడు సాయుధ కార్యకలాపాలతోపాటు, పార్టీ అనుబంధ ప్రజా సంఘాల ద్వారా వివిధ జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఆయా పార్టీలు ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ముఖ్యంగా సిరిసిల్లలో జనశక్తి రాజన్న వర్గానికి చెందిన ఎన్ వీ కృష్ణయ్య, న్యూ డెమోక్రసీ నుంచి ఇల్లెందులో గుమ్మడి నర్సయ్య వంటి నాయకులు పలుసార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొంది చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు. ములుగు నియోజకవర్గం నుంచి కాక లింగయ్యను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ఆ ప్రాంతంలో గట్టి పట్టుగల ప్రతిఘటన పార్టీ మాత్రం సఫలీకృతం కాలేకపోయింది. కాలక్రమంలో న్యూ డెమోక్రసీ పార్టీ 2022 ఫిబ్రవరిలో చీలిపోయింది. అంతకు ముందు 2013లోనూ పాతూరి ఆదినారాయణ అలియాస్ చంద్రన్న హయాంలోనూ ఈ పార్టీలో చీలిక ఏర్పడింది.

పోటు రంగారావుకు ఎన్ఐఏ జారీ చేసిన నోటీసు

ప్రస్తుతం చీలిపోయిన న్యూ డెమోక్రసీకి పోటు సూర్యం, ప్రజాపంథా పార్టీకి పోటు రంగారావులు రాష్ట్ర నాయకత్వం వహిస్తున్నారు. అంతర్థానమైన అనేక నక్సల్ గ్రూపులతోపాటు ప్రస్తుతం గల మాస్ లైన్, న్యూ డెమోక్రసీ పార్టీలకు ఒకప్పుడు గల సాయుధ దళాలేవీ ఇప్పుడు అడవుల్లో లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా ప్రస్తుతం భూస్వామ్య వ్యవస్థ లేదని, పెట్టుబడిదారీ వ్యవస్థ మాత్రమే ఉందని, సాయుధ కార్యకలాపాలు అవసరంలేదని చర్చించి, విడిపోయిన మాస్ లైన్ పార్టీ ప్రజా ఉద్యమాలపైనే తన దృష్టిని కేంద్రీకరించింది. ఒకప్పటి న్యూ డెమోక్రసీ పార్టీ సాయుధ దళాలకు జిల్లా నాయకత్వ బాధ్యతలు వహించిన అవునూరి మధు సైతం ప్రస్తుతం జనబాహుళ్యంలోనే తిరుగుతున్నారు.

ఇక వెలుగుమట్ల భూదాన్ భూముల అంశంలో యూసీసీఆర్ఐ (ఎంఎల్) పార్టీ కూడా రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయా పార్టీల్లో ఏ సంస్థకు కూడా ప్రస్తుతం సాయుధ దళాలు లేకపోవడం గమనార్హం. కానీ ప్రజలను సమీకరించడంలో, వివిధ అంశాల్లో పోరాటాలు నిర్వహించడంలో ఎంఎల్ పార్టీలు కొన్ని అత్యంత క్రియాశీలకంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేయడం విప్లవ కార్యకలాపాల పరిశీలకుల్లో భిన్న చర్చకు దారి తీసింది. గాదె ఇన్నయ్యపై నమోదైన కేసులోనే 406వ వ్యక్తిగా రంగారావును విచారణకు పిలిచినట్లు ఆ పార్టీ చెబుతోంది.

మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తదితరులు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడినప్పటి చిత్రం

తనకు నోటీసు జారీ చేయడంపై ఖమ్మంలో బుధవారంనాటి మీడియా సమావేశంలో పోటు రంగారావు స్పందించారు. సూర్యోదయం, శిశోదయం కుట్ర కాదని తనకు అందిన నోటీసుపై ఆయన వ్యాఖ్యానించారు. కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు తమకు తెలియదన్నారు. తెలంగాణా ఉద్యమ సమయంలో నమోదైన కేసులను, పోడు భూముల పోరాట కేసులు సహా చిట్టచివరి కేసు కూడా గత మార్చిలోనే కొట్టేశారని గుర్తు చేశారు. తనకు ఎన్ఐఏ నోటీసు అందడంపై ఆశ్యర్యపోయానని, నవ్వుకున్నానని పోటు రంగారావు పేర్కొన్నారు. తాను ఇన్నయ్య అరెస్టును ఖండించానని, అంత్యక్రియల్లో పాల్గొనడం అతని హక్కుగా చెప్పానని, మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా తాను స్పందించానని చెప్పారు. తనపై నమోదైన కేసును ఎత్తివేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కాగా ఇది ప్రశ్నించే హక్కును నిలువరించడమేనని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూడా పేర్కొన్నారు. తమ పార్టీ నాయకుడు రంగారావుకు ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.

నున్నా నాగేశ్వర్ రావు

పోటు’కు నోటీసుపై సీపీఎం ఖండన:
కాగా సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఉపా చట్టం కింద కేసు, నోటీసు జారీ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేద ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న నాయకులపై ఇలాంటి దేశద్రోహం తరహా కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న వారిని కేసులు, బెదిరింపులతో అణచివేయాలని ప్రయత్నించడం సరైంది కాదన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్యగా ఆయన అభివర్ణించారు. పోటు రంగారావు వంటి ప్రజా నాయకులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వం పునరాలోచన చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి కాకుండా, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేయాలని నున్నా నాగేశ్వర్ రావు తన ప్రకటనలో కోరారు.

Popular Articles