Top 5 This Week

Related Posts

నకిలీ బంగారంతో బ్యాంకు రుణం: ముగ్గురి అరెస్ట్

ఏన్కూరు: నకిలీ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి భారీ మొత్తపు రుణం తీసుకుని బ్యాంకును మోసగించిన ఘటనలో ఖమ్మం జిల్లా ఏన్కూరు పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ ఛీటింగ్ బాగోతంలో బ్యాంకులో గోల్డ్ అప్రయిజర్ గా పనిచేసే వ్యక్తి కూడా నిందితుడే కావడం గమనార్హం.

కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ కథనం ప్రకారం.. ఏన్కూరులోని తెలంగాణా గ్రామీణ బ్యాంకులో 2024లో బంగారు ఆభరణాల విలువను నిర్ధారించే అధికారి (గోల్డ్ అప్రయిజర్) శ్రీపాది సతీష్, శ్రీపాది మౌనిక, రామచంద్రోజు జయమ్మ, రామచంద్రోజు నరేష్ లు పరస్పరం కుమ్ముకయ్యారు. ఈమేరకు 242.25 గ్రాముల పరిమాణం గల నకిలీ బంగారు ఆభరణాలను అసలైన నగలుగా నమ్మించి బ్యాంకులో తాకట్టు పెట్టారు. తద్వారా రూ. 9.53 లక్షల మొత్తాన్ని రుణంగా పొందారు.

అరెస్ట్ చేసిన నిందితులతో ఏన్కూరు ఎస్ఐ సంధ్య, ఇతర పోలీస్ సిబ్బంది

అయితే తీసుకున్న రుణానికి సంబంధించిన డబ్బును తిరిగి చెల్లించకపోవడంతో, నగలు తాకట్టు పెట్టిన బ్యాంకు ఖాతాలు నిరర్ధక అస్తులు (NPAs)గా మారాయి. ఈ నేపథ్యంలో తాకట్టులో గల ఆయా ఖాతాల్లోని నగలను వేలం వేసే ప్రక్రియను బ్యాంక్ అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా నగలు నకిలీవిగా బ్యాంక్ అధికారులు గుర్తించారు. ఘటనపై బ్యాంక్ మేనేజర్ కేవీ ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏన్కూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన తర్వాత, ఛీటింగ్ బాగోతంలో నలుగురు వ్యక్తులను నిందితులుగా గుర్తించారు.

వారిలో బ్యాంక్ గోల్డ్ అప్రయిజర్ శ్రీపాది సతీష్ తోపాటు, రామచంద్రోజు జయమ్మ, నరేష్ లను అరెస్ట్ చేసినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ వివరించారు. మరో నిందితురాలు శ్రీపాది మౌనిక పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఎవరైనా సరే ఇటువంటి మోసపూరిత చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తప్పవని ఏసీపీ వసుంధర యాదవ్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Popular Articles