హైదరాబాద్: భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నగర పాలక సంస్థలో అధికార పగ్గాలపై కాంగ్రెస్, సీపీఐ పార్టీలు ఓ అంగీకారానికి వచ్చాయి. శనివారం రాత్రి పొద్దుపోయాక జరిగిన చర్చల అనంతరం ఇరుపార్టీలు పపరస్పర ఒప్పందం చేసుకున్నాయి. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ లతో సీపీఐ నాయకుడు పల్లా వెంకట్ రెడ్డి చర్చలు జరిపారు. జూబ్లీ హిల్స్ నివాసానికి వచ్చిన పల్లా వెంకట్ రెడ్డి కొత్తగూడెంలో పరిస్థితులను, పార్టీల బలాబలాలను ఆయనకు వివరించారు. ఆ తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీపీఐ నేత పల్లా వెంకట్ రెడ్డిలు సమావేశమై చర్చించుకున్నారు.
ఈ చర్చల అనంతం ఇరుపార్టీల మధ్య కుదిరిన ఒప్పందపు వివరాలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మీడియాకు వివరించారు. మొదటి రెండున్నరేళ్లు సీపీఐకి మేయర్, కాంగ్రెస్ కు డిప్యూటీ మేయర్, ఆ తర్వాత చివరి రెండున్నరేళ్లు కాంగ్రెస్ కు మేయర్, సీపీఐకి డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చి, పదవులు పంచుకునే విధంగా అంగీకారం కుదిరినట్లు పీసీసీ చీఫ్ వివరించారు. కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐలు స్నేహపూర్వక పోటీకి దిగాయని, ఎన్నికలకు ముందు సమాచారలోపం వల్ల ఇలా జరిగిందన్నారు. జాతీయ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ తో నడవాలని నిర్ణయించుకున్నట్లు సీపీఐ నాయకుడు పల్లా వెంకట్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే చెరో రెండున్నరేళ్లు పదవులు పంచుకుటామన్నారు.

